వీఆర్వోపై హత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

వీఆర్వోపై హత్యాయత్నం

Sep 16 2026 4:01 AM | Updated on Sep 16 2026 4:01 AM

మిద్దైపె నిద్రిస్తుండగా

తల, ముఖంపై తీవ్ర గాయాలు

సి.బెళగల్‌: ఎమ్మిగనూరు మండలం ఏనుగబాల గ్రామ రెవెన్యూ అధికారి గోపాల్‌పై హత్యాయత్నం జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు.. మండలంలోని మారందొడ్డి గ్రామానికి చెందిన బోయ గోపాల్‌ ఎమ్మిగనూరు మండలం ఏనుగబాల గ్రామ వీఆర్వోగా విధులు నిర్వర్తిస్తున్నారు. కుటుంబంతో కలిసి మారందొడ్డి గ్రామంలో నివాసముంటూ రోజూ విధులకు వెళ్లి వస్తుంటారు. అయితే సోమవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి మిద్దైపె నిద్రించగా గుర్తు తెలియని దుండగుడు పదునైన మరణాయుధంతో వీఆర్వో గోపాల్‌పై దాడి చేశాడు. ఉలికిపాటుతో వీఆర్వో అరవగా, కుటుంబ సభ్యులు మేలుకుని కేకలు వేయడంతో దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన వీఆర్‌ఓను కుటుంబసభ్యులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు. ఆగంతకుడి దాడిలో వీఆర్వో మెడపై రెండు తీవ్ర రక్తగాయాలు కాగా, కుడి దవడ పూర్తిగా ఛిద్రమైంది. అదేవిధంగా ఎడమ చెయ్యి, ఛాతిపై ఇలా మరో ఐదు చోట్ల రక్తపు గాయాలైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తీవ్ర రక్తస్రావం కావడంతో బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ వేణుగోపాల్‌రాజు సోమవారం అర్ధరాత్రి కర్నూలు ఆసుపత్రిలో క్షతగాత్రుడిని పరిశీలించి, బాధితుడితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఎస్‌ఐ మాట్లాడుతూ.. వీఆర్వోపై దాడికి గల కారణాలు తెలియరాలేదని, బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లో విచారణ చేపడతామన్నారు. కాగా మంగళవారం కర్నూలు క్లూస్‌ టీం సభ్యులు స్థానిక పోలీస్‌ సిబ్బందితో గ్రామానికి చేరుకుని ఘటనా స్థలాన్ని, బాధితుడి ఇంటి పరిసరాలను పరిశీలించి, ఆధారాలు సేకరించారు.

మరణాయుధంతో దాడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement