● మత్స్యకారున్ని చంపి కృష్ణానదిలో వేసినట్లు ఆనవాళ్లు ● భయాందోళనలో మత్స్యకారులు
కొత్తపల్లి: మండల పరిధిలోని సంగమేశ్వరం వద్ద కృష్ణానదిలో గుర్తు తెలియని శవం లభ్యమైంది. మంగళవారం సంగమేశ్వరం సమీపంలోని బిలం కాంచమ్మ గుడి కింది భాగంలో గోపాదం ప్రాంతంలో కృష్ణానదిలో కుళ్లిన స్థితిలో ఓ మత్స్యకారుడి శవం కనిపించింది. సమాచారం తెలుసుకున్న ఆత్మకూరు సీఐ సురేష్‌కుమార్ రెడ్డి, కొత్తపల్లి ఎస్‌ఐ జయశేఖర్ అక్కడికి చేరుకొని నదిలోని శవాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వారు మాట్లాడుతూ.. లభ్యమైన శవం వైజాగ్ చెందిన మత్స్యకారునిదా, ఇక్కడి ప్రాంతం వారిదా అని తెలియాల్సి ఉందన్నారు. చేతులు, కాళ్లు కట్టేసి ఉండడం, ఒంటిపై దెబ్బలు ఉన్నట్లు గుర్తించామన్నారు. హత్యగా కేసునమోదు చేసుకొని విచారణ చేపట్టామని ఎస్‌ఐ వెల్లడించారు. నదిలో మృతదేహం లభ్యమైన ఘటనతో కృష్ణానది వెంట ఉన్న మత్స్యకారులు భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటి ఘటనలు ఏడాదిలో కనీసం మూడైనా జరగడం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది. వైజాగ్, రాజమండ్రి, శ్రీకాకుళం, గుంటూరు, విజయవాడ వైపు నుంచి కొందరు మధ్యవర్తులు పనిలేని యువకులకు, మధ్య వయస్సు వారికి నెలకు రూ.15 వేలు ఇస్తామని చెప్పి ఇక్కడి అలివి వలల దళారులకు అప్పజెప్పడం, వారితో చేపలవేట పేరుతో వెట్టిచాకిరీ చేయిస్తూ డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని కొంత మంది మత్స్యకారులు అనుకోవడం గమనార్హం. ఎవరైనా డబ్బులు అడిగినా, పని చేయలేక పారిపోవాలని ప్రయత్నించినా ఇలా హత్యచేసి కృష్ణానదిలో పడేసి ప్రమాదంగానో, ఆత్మహత్యగానో చిత్రీకరిస్తారన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే సంబంధిత అధికారులు ఇలాంటి ఘటనలను ఎందుకు నిషేధించలేక పోతున్నారనే దానిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా హత్యలకు పాల్పడుతున్న వారిని పట్టుకుని కఠిన శిక్ష విధించాలని మత్స్యకారులు కోరుతున్నారు.


