అవుకు(కొలిమిగుండ్ల): పట్టణంలోని కుమ్మరిదిడ్డి వీధికి చెందిన నిరుపేద కుటుంబానికి ఎస్‌ఐ అశోక్ మంగళవారం నిత్యావసర సరుకులు అందజేశారు. దాసరి లక్ష్మీదేవి కుమారుడు, కోడలు ఇద్దరు మృతి చెందారు. మనువరాలు భువనేశ్వరిని పోషించుకుంటూ జీవనం సాగిస్తోంది. లక్ష్మీదేవి ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆ కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న ఎస్‌ఐ ఆ ఇంటికి చేరుకొని పది కేజీల బియ్యంతో పాటు ఇతర నిత్యావసర వస్తువులను స్వయంగా అందించారు. భువనేశ్వరి చదువుకునేందుకు భరోసా కల్పించారు. కష్టపడి చదువుకొని మంచి ఉద్యోగం సాధించాలని ఎస్‌ఐ సూచించారు.
10న జూనియర్ హాకీ పోటీలు
కర్నూలు (టౌన్): స్థానిక మున్సిపల్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఈనెల 10వ తేదీన హాకీ కర్నూలు అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళల విభాగంలో జూనియర్ హాకీ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ కోర్ కమిటీ సభ్యుడు దాసరి సుధీర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2007 తరువాత జన్మించిన క్రీడాకారులు అర్హులని పేర్కొన్నారు. ప్రతిభ కనబరచిన క్రీడాకారులు ఈనెల 16 నుంచి 18వ తేదీ వరకు చిత్తూరు జిల్లాలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి జూనియర్ హాకీ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు ఫొటో, ఆధార్‌కార్డుతో హాజరు కావాలని, వివరాలకు 99665 65317 సెల్ నంబర్‌ను సంప్రదించాలన్నారు.
ఈ–నామ్‌లో టెక్నికల్
సమస్యల వెల్లువ
కర్నూలు(అగ్రికల్చర్): ఈ–నామ్‌లో వెర్షన్ మారినప్పుడు ముందుగా ట్రయల్ నిర్వహించి సాంకేతిక సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించిన తర్వాతే అమలు చేయాలి. అయితే ఎలాంటి ట్రయల్ లేకుండా అమలు చేయడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమై రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ–నామ్‌లో కొత్తగా 2.0 వెర్షన్ వచ్చింది. ఈ వెర్షన్‌లో అనేక సమస్యలు ఉత్పన్నం అవుతుండటం వల్ల రెండు, మూడు రోజులుగా మాన్యువల్‌లో పాత పద్ధతిలో వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేశారు. మంగళవారం ఈ–నామ్ 2.0 వెర్షన్ ద్వారా కొనుగోలు చేశారు. ఇందులో అనేక సాంకేతిక సమస్యలు ఉత్పన్నం అయ్యాయి. పలువురు రైతులు తెచ్చిన వ్యవసాయ ఉత్పత్తులకు ఎక్కువ ధర కోట్ చేసి ఉంటే తక్కువ ధర చూపటంతో రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. వేరుశనగ, కందులు, శనగలు తదితర పంటలకు వ్యాపారులు ఎక్కువ ధర వేశారు. అయితే ఈ– నామ్‌లో తక్కువ ధర ఉండటంతో రైతుల ఆందోళన అంతా, ఇంతా కాదు. ఈ–నామ్ సాంకేతిక సమస్యలతో తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడిందనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వేరుశనగలో కర్నూలు మార్కెట్‌కు వచ్చిన లాట్‌కు రేటు వేస్తే అది ఎమ్మిగనూరులో చూపడం గమనార్హం. ట్రయల్ లేకుండా అమలు చేయడం వల్ల రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది.
బాల్య వివాహం అడ్డగింత
ఆదోని రూరల్: మండలంలోని సుల్తానాపురం గ్రామంలో బుధవారం జరగనున్న బాల్య వివాహాన్ని ఆదోని శక్తి టీం మెంబర్లు రాజేశ్వరి, నాగరాజు, హెడ్‌కానిస్టేబుల్ నాయక్, సూపర్‌వైజర్ గొల్ల సావిత్రి, వీఆర్వో కృష్ణ మంగళవారం అడ్డుకున్నారు. ఈ నెల 8వ తేదీన గ్రామంలో నాగేంద్ర అనే యువకుడికి మైనర్ బాలికతో వివాహం జరగనుందని పక్కా సమాచారం రావడంతో వారు గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా శక్తి టీం సభ్యు లు మాట్లాడుతూ.. బాలిక ఇటీవల పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసి బతుకుదెరువు కోసం కడప జిల్లా మంగమ్మపేటకు వెళ్లారన్నారు. ఆమె తల్లిదండ్రులు శుక్రవారం సుల్తానాపురం గ్రామంలో వివా హం జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని, బాలిక వయస్సు 18 ఏళ్లు లోపు ఉండడంతో బాల్య వివాహం చేసిన వారికి, ప్రోత్సహించిన వారికి జైలు శిక్ష పడుతుందని అవగాహన కల్పించారు. బాలికకు 18 ఏళ్లు పూర్తయ్యే వరకు వివాహం చేయరాదని సూచించారు. వరుడు నాగేంద్ర, అతని తల్లికి కూడా కౌన్సెలింగ్ ఇచ్చి బాల్యవివాహాన్ని రద్దు చేశారు.


