కర్నూలు: కర్నూలు ప్రభుత్వాసుపత్రి ఇన్ గేటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బీఎస్‌ఎన్‌ఎల్ విశ్రాంత ఉద్యోగి డీపీ స్వామన్న (74) తీవ్ర గాయాలకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక మంగళవారం తెల్లవారుజామున మృతిచెందారు. మిడుతూరు మండలం మాసాపేట గ్రామానికి చెందిన ఈయన మోకాళ్ల నొప్పులతో కొంతకాలంగా బాధపడుతూ వైద్యం చేయించుకునేందుకు కర్నూలుకు వచ్చారు. సోమవారం సాయంత్రం ప్రభుత్వాసుపత్రి ఇన్‌గేట్ నుంచి బుధవారపేట జంక్షన్ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా రోడ్డుపై గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయాలై రోడ్డుపై సొమ్మసిల్లి పడిపోవడంతో స్థానికులు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. అయితే కోలుకోలేక మృతిచెందడంతో మృతదేహాన్ని ఆసుపత్రిలోని మార్చురీ కేంద్రంలో భద్రపరిచారు. అతని కుమారుడు కిరణ్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.


