బనగానపల్లె: మండలంలోని నందివర్గం పోలీసుస్టేషన్ పరిధిలోని నందవరం గ్రామంలో కుటుంబ తగాదాలతో భర్త కాళ్ల వెంగన్న భార్య వెంకటలక్ష్మమ్మ (60)ను గొడ్డలితో నరికి చంపిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. బనగానపల్లె రూరల్ సీఐ మంజునాథ్‌రెడ్డి కథనం మేరకు.. వెంగన్న దంపతులకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉండగా అందరికీ వివాహాలయ్యాయి. ఈ క్రమంలో గత కొంతకాలంగా భార్యభర్తల మధ్య కుటుంబ తగాదాలు జరుగుతున్నాయి. భార్య వెంకటలక్ష్మమ్మను హతమార్చాలనుకున్న భర్త వెంగన్న రెండు రోజుల క్రితం రాత్రి ఇంట్లోనే గొడ్డలితో ఆమెను నరికిచంపారు. రాత్రంతా ఇంట్లోనే ఉండి ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఈ స్థితిలో మంగళవారం తెల్లవారుజామున ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఇంటిలోపలికి వెళ్లి చూడగా కుళ్లిన స్థితిలో వెంకటలక్ష్మమ్మ మృతదేహం కనిపించింది. కుమారుడు కాళ్ల ఆంజనేయులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శవాన్ని పోస్టుమార్టం కోసం బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మంజునాథ్‌రెడ్డి తెలిపారు.


