శ్రీశైలం: మల్లన్న దర్శనార్థమై శ్రీశైలం వచ్చిన కన్నడిగులు ఆదివారం క్యూలైన్లలో ప్రమాదకర పరిస్థితుల్లో సహసం ప్రదర్శించారు. సుమారు 20 అడుగుల పైగా ఎత్తుకు కట్టిన క్యూల గ్రిల్స్ పైకి ఎగబాకి పైన ఉన్న ఖాళీ స్థలం నుంచి పక్కనే ఉన్న మరో క్యూలోకి కిందికి దూకారు. ఆదివారం రాత్రి వరకే స్పర్శ దర్శనం ఉండడంతో సోమవారం నుంచి అలంకార దర్శనం మాత్ర మే ఏర్పాటు చేయడంతో ఎలాగైనా స్వామివార్లను స్పర్శ దర్శనం చేసుకోవాలని సంకల్పంతో ఈ సాహసానికి పాల్పడ్డారు. ఆదివారం వేకువ జాము నుంచి ఉచిత ప్రత్యేక దర్శన క్యూలన్ని భక్తులతో కిక్కిరిసిపోయాయి. త్వరగా దర్శనం చేసుకోవాలని తలంపుతో కొంతమంది ఒక క్యూ నుంచి మరో క్యూలోకి వెళ్లేందుకు సాహసం చేశారు. ఉచిత ప్రత్యేక దర్శన శీఘ్ర దర్శన క్యూ షెడ్లలో ఉన్న ఇనుప గ్రిల్ పట్టుకొని పైన ఉన్న ఖాళీ స్థలం నుంచి మరో క్యూలోకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అంత ఎత్తు నుంచి ఎవరైనా ప్రమాదవశాత్తు కింద పడితే అంతే సంగతులు. మరోవైపు 500 రూపాయల అతి శీఘ్ర దర్శనం టికెట్ల క్యూల వద్ద టికెట్ల కోసం ఇదే పరిస్థితి నెలకొంది. అయితే అక్కడ పోలీసు బందోబస్తు ఉండటంతో పోలీసులు చొరవ తీసుకొని తోపులాటను అడ్డుకున్నారు. కానీ క్యూ కంపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించాక లోపల బందోబస్తు పోలీసులు తెల్లవారుజాము సమయంలో లేకపోవడంతో కొందరు యువకులు అత్యుత్సాహంతో ఎత్తైన క్యూలలోకి ఎక్కి దిగారు.


