హాలహర్వి: ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటక రాష్ట్రంలోని ప్రసిద్ధ బ్యాడిగ మిరప మార్కెట్‌కు మిరప తరలింపు జోరందుకుంది. జిల్లాలోని కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆలూరు, ఆదోని మండలాలతో పాటు హాలహర్వి మండలంలోని గూళ్యం, నిట్రవట్టి, సిద్ధాపురం తదితర గ్రామాల నుంచి రైతులు తమ పంట దిగుబడులను టిప్పర్‌లు, మినీ వాహనాల్లో తరలిస్తున్నారు. ఆలూరు మీదుగా ఈ వాహనాలు వెళ్తూ హాలహర్విలో రోడ్డు పక్కన ఆపడంతో సందడి నెలకొంది. కాగా.. ఎకరాలో పంట సాగుకు రూ.80 వేల నుంచి రూ.1.20లక్షల వరకు వెచ్చించారు. బ్యాడిగ రకం మిరప ఎకరాకు 6–10 క్వింటాల దిగుబడి వస్తుంది. సీడు మిరప ఎకరాకు 15–20 క్వింటాల వరకు దిగుబడి వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. గుంటూరు మార్కెట్‌కు వెళ్లడానికి దూరం కావడంతో పాటు.. ఖర్చులు ఎక్కువవుతుండటంతో సరైన ధర లభించదని, వెంటనే టెండర్లు పాడి డబ్బు వెంటనే ఇస్తున్న కారణంగా బ్యాడిగకు వెళ్లి విక్రయించడానికి రైతులు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం సీడ్ మిరప ధర క్వింటా రూ.15వేల నుంచి రూ.20 వేలు ఉండగా.. బ్యాడిగ మిరప ధర క్వింటా రూ.42వేల నుంచి రూ.53 వేలు పలుకుతోంది.


