విశ్రాంత రెవెన్యూ ఉద్యోగులకు సన్మానం
కర్నూలు(సెంట్రల్): పదవి వివరణ చేసిన సుమారు 200 మంది విశ్రాంత రెవెన్యూ ఉద్యోగులకు ఘన సన్మానం లభించింది. గురువారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో కర్నూలు జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సొసైటీ ఆధ్వర్యంలో 2007 డిసెంబర్ నుంచి 2025 డిసెంబర్ 31వ తేదీ వరకు పదవి విరమణ చేసిన వివిధ క్యాడర్లకు చెందిన ఉద్యోగులకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రెవెన్యూ విశ్రాంత ఉద్యోగులు సమస్యల పరిష్కారం కోసం తగిన సూచనలు ఇవ్వాలన్నారు. ఒక్కసారిగా 200 మందిని సన్మానించేందుకు ఏర్పాట్లు చేయడం అభినందించదగ్గ విషయమన్నారు. అనంతరం 200 మందికి శాలువ కప్పి సన్మానం చేశారు. మధ్యాహ్నం విందు భోజనం ఏర్పాటు చేసి ఉద్యోగుల కుటుంబ సభ్యులను ఆహ్వానించినట్లు ఆ సంఘవం అధ్యక్ష, కార్యదర్శులు పి.అజయ్‌కుమార్, సయ్యద్ రోషన్‌అలీ తెలిపారు. కార్యక్రమంలో కోశాధికారి కిష్టన్న, కన్వీనర్ మురారి శంకరయ్య, నాయకులు జయన్న పాల్గొన్నారు.
ఆరేళ్ల నరకం.. అరుదైన వైద్యం
కర్నూలు(హాస్పిటల్): అరుదైన వ్యాధితో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఓ మహిళకు కర్నూలు పెద్దాసుపత్రి వైద్యులు ఊపిరి పోశారు. వివరాలివీ.. అనంతపురం జిల్లా డి.హీరేహాల్ మండలం సిద్దాపురం గ్రామానికి చెందిన తులసి(30) ఆరేళ్లుగా తీవ్రమైన శరీర నొప్పులు, కండరాల బలహీనతతో బాధపడుతూ మంచానికే పరిమితమైంది. చికిత్స కోసం రూ.5లక్షలకు పైగా ఖర్చు చేసినా ఫలితం లేకపోయింది. ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. సన్నిహితుల సలహాతో దివ్యాంగుల సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకుంది. పరీక్షించేందుకు ఆదోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఏర్పాటు చేసిన సదరం క్యాంపునకు పంపించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్, ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ నాగరాజు ఆమె వైద్యపరీక్షల నివేదికలు పరీక్షించారు. పాస్ఫరస్ తగ్గడం వల్లే ఇలా జరిగిందని నిర్ధారించుకుని, పూర్తిస్థాయి వైద్యపరీక్షలు, చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు గత సంవత్సరం అక్టోబర్ 25న రెఫర్ చేశారు. ఎండోక్రైనాలజి విభాగాధిపతి డాక్టర్ పి.శ్రీనివాసులు, డాక్టర్ రాధారాణి బృందం ఆమెను పరీక్షించి సమగ్ర వైద్యపరీక్షలు చేయించారు. పీఈటీ స్కాన్‌లో వెన్నుముక చివర కణితి ఉన్నట్లు గుర్తించారు. దీని కారణంగానే శరీరంలో పాస్ఫరస్ తగ్గుతోందని తెలుసుకున్నారు. అవసరమైన శస్త్రచికిత్స కోసం స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కు పంపించారు. అక్కడ సర్జికల్ ఆంకాలజిస్టులు డాక్టర్ ఎస్.చైతన్యవాణి, డాక్టర్ జి.బీసన్నలు ఆమెను పరీక్షించారు. గత నవంబర్ 10 శస్త్రచికిత్స ద్వారా కణితి తొలగించారు. ఆపరేషన్ జరిగిన 24 గంటల్లోనే ఆమె ఆరోగ్యంలో గణనీయమైన మెరుగుదల కనిపించింది. వారం వ్యవధిలోనే ఆమె స్వయంగా నడవగలిగే స్థాయికి చేరుకుంది. గురువారం ఆమె పరీక్షల కోసం ఆసుపత్రికి రావడంతో విజయవంతమైన చికిత్స గురించి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, వైద్యులు విలేకరులకు వివరించారు. సమావేశంలో సీఎస్‌ఆర్‌ఎం డాక్టర్ పద్మజ, ఆర్‌ఎంఓ డాక్టర్ వెంకటరమణ, అనెస్తెటిస్ట్ డాక్టర్ భారతి, రేడియాలజిస్టు డాక్టర్ ఎస్.వినోద్‌కుమార్ పాల్గొన్నారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని..
నందికొట్కూరు: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని నీలిషికారి పేట సమీపంలో కర్నూలు–గుంటూరు ప్రధాన రహదారిపై జూపాడుబంగ్లా మండలం తర్తూరు గ్రామానికి చెందిన నడిపెన్న (60)ను గుర్తు తెలియని వాహనం ఢీకొంది. తీవ్ర గాయాల పాలైన వృద్ధుడిని స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. కాగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి కుమార్తె నందికొట్కూరు రూరల్ సర్కిల్ పోలీసు స్టేషన్ కార్యాలయంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
విశ్రాంత రెవెన్యూ ఉద్యోగులకు సన్మానం


