ఉద్యమానికి సిద్ధంకండి
● ఈనెల 30 నుంచి నిరసన
కార్యక్రమాలు
● ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షుడు
టీకే జనార్దన్
ఎమ్మిగనూరుటౌన్: ఇచ్చిన హామీలు అమలు చేసేలా టీడీపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఉద్యమానికి సిద్ధం కావాలని ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షుడు టికె.జనార్దన్ పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని ఎస్‌టీయూ ప్రాంతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆరు మండలాల ఎస్‌టీయూ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 11వ పీఆర్సీ గడువు పూర్తయి 30 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నేటికి 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయలేదని ధ్వజమెత్తారు. 12వ పీఆర్సీ ఆలస్యమతుండటంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆర్థికంగా నష్టపోకుండా 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో వున్న గ్రాట్యుటీ, లీవ్ ఎన్ క్యాష్‌మెంట్ మొత్తాలను వెంటనే విడుదల చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ మెమో నెంబర్ 57 ప్రకారం 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలన్నారు. 2024 నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన నాలుగు విడతల డీఏలను సత్వరం విడుదల చేయాలని సూచించారు. ఎన్నికల హమీల్లో భాగంగా ఉద్యోగులకు సీపీఎస్ విధానానికి ప్రత్యామ్నాయ ప్రయోజనకరమైన విధానాన్ని పరిశీలిస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలవుతున్నా దృష్టి సారించలేదన్నారు. సీపీఎస్ విధానానికి ప్రత్యామ్నాయంగా ఓపీఎస్ విధానాన్నే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హమీల అమలకు దశల వారీగా ఉద్యమాలు చేపట్టనున్నామన్నారు. ఇందు లో భాగంగా ఈనెల 30వ తేదీన తహసీల్దార్లకు వినతి పత్రాలివ్వడం, ఫిబ్రవరి 10వ తేదీన అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా కార్యక్రమం, ఫిబ్రవరి 25న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎస్‌టీయూ నాయకులు బాబయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అడివన్న, నాయకులు వెంకటేశ్వర్లు, ప్రసన్నరాజు, నాగరాజు, వెంకట్రాముడు, రామచంద్ర, ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు.


