ఆర్‌ఎంపీ కిడ్నాప్ కలకలం
● 100కు కాల్ చేసిన కుటుంబ సభ్యులు
● కిడ్నాపర్లను పట్టుకున్న పోలీసులు
● ఆర్థిక లావాదేవీలే
కిడ్నా్‌ప్‌నకు కారణం
ఎమ్మిగనూరు రూరల్: ఆర్థిక లావాదేవీల కారణంగా ఓ ఆర్‌ఎంపీ కిడ్నాప్ ఘటన ఎమ్మిగనూరు పట్టణంలో కలకలం రేపింది. అతని కుటుంబ సభ్యు లు తెలిపిన వివరాల మేరకు.. పట్టణానికి చెందిన ఆర్‌ఎంపీ ఉప్పర కృష్ణకు పెద్దకడబూరు మండలం కంపాడుబాపురం గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ లోకేష్ ఆచారి మధ్య ఆర్థిక లావాదేవిలు ఉన్నాయి. తాను అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని, లేదా స్థలం రిజిస్ట్రేషన్ చేయించాలని లోకేష్ ఆచారి ఒత్తిడి తెచ్చాడు. అయితే రూ. 1.50 కోట్ల విలువ చేసే స్థలాన్ని రూ. 80 లక్షలకే రిజిస్ట్రేషన్ చేయించాలని చెప్పడంతో కృష్ణ నిరాకరించాడు. దీంతో కిడ్నాప్ చేసి బళ్లారిలో రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు లోకేష్ ఆచారి కుట్ర పన్నాడు. ఈ మేరకు గురువారం గాంధీనగర్‌లో శిల్పాప్రైయిడ్‌లోని ఇంటి గేటు నుంచి బయటకు వస్తున్న కృష్ణను అప్పటికే కాపుకాసిన లోకేష్‌ఆచారి, కృష్ణమూర్తి ఆచారి, భాస్కర్‌రెడ్డితో పాటు మరో ఇద్దరు కృష్ణను బలవంతంగా ఆటోలోకి తోసి కిడ్నాప్ చేశారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే 100కు కాల్ చేయటంతో పట్టణ పోలీసులు అప్రమత్తమయ్యారు. పట్టణ ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి సాంకేతిక పరిజ్ఞానంతో దుండగల జాడను గుర్తించి ఆలూరు మీదుగా బళ్లారి వైపు వెళ్తున్నట్లు తెలుసుకున్నారు. వెంటనే ఆలూరు పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వటంతో అక్కడ పోలీసులు ఆటోను ఆపి కృష్ణతో పాటు కిడ్నాపర్లను ఆలూరు పోలీసులు అదుపులో తీసుకుని ఎమ్మిగనూరుకు తరలించారు. దాడిలో గాయపడిన కృష్ణను చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కిడ్నాపర్లపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని టౌన్ ఎస్‌ఐ తెలిపారు. పోలీసులు స్పందించడంతో తాను ప్రాణాలతో బయట పడ్డాడని ఆర్‌ఎంపీ కృష్ణ చెబుతున్నారు.


