ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్‌లో కొండచిలువ
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు సీతారాం నగర్‌లో ని గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్‌లోకి శనివారం భారీ కొండ చిలువ కలకలం రేపింది. 30 కిలోల బరువు, 14 అడుగుల పొడవు కలిగిన కొండచిలువను చూసి ఉద్యోగులు, స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. నిత్యం జనసంచారం, వాహనాల రాకపోకలు ఉన్న ప్రింటింగ్ ప్రెస్‌లోకి కొండ చిలువ ప్రవేశించడం గమనార్హం. ప్రింటింగ్ ప్రెస్‌కు సమీపంలోనే రైల్వే షెడ్లు ఉన్నాయి. అక్కడి నుంచి పాము ఈ కార్యాలయంలోకి ప్రవేశించినట్లు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సంఘమిత్ర అనిమల్ ఫౌండేషన్ వైల్డ్‌లైఫ్ హెడ్ మహమ్మద్ ఇద్రిస్‌కు విషయం తెలిపారు. వెంటనే అతను అక్కడికి చేరుకుని చాకచక్యంగా పట్టుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నా రు. కొండచిలువకు ఎలాంటి హాని తలపెట్టకుండా అటవీ ప్రాంతంలో వదిలేశారు.
సర్పాలపై అవగాహన..
విష, విష రహిత సర్పాలపై సంఘమిత్ర అనిమల్ ఫౌండేషన్ వైల్డ్‌లైఫ్ హెడ్ మోహమ్మద్ ఇద్రిస్ స్థానికులకు అవగాహన కల్పించారు. ఈ జాతి పాముల బొమ్మలు కలిగిన బుక్‌లెట్స్‌ను ప్రజలకు పంపిణీ చేశారు. నాగుపాము, కట్లపాము, రక్త పింజర, ఇసుకపింజర పాములు మాత్రమే విషపూరితమైనవని, జెర్రిపోతు, నీరుకంటి తదితర పాములు విష రహితమైనవన్నారు.
ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్‌లో కొండచిలువ


