
బిట్‌కాయిన్ పెట్టుబడుల పేరుతో మోసాలు
కర్నూలు: బిట్‌కాయిన్ పెట్టుబడుల విషయంలో స్మార్ట్ ఫోన్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ జిల్లా ప్రజలకు సూచించారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పెట్టుబడులు పెడితే లాభాలు వస్తున్నాయంటూ ఫాలోయర్లకు నకిలీ లింకులు పంపుతున్నారని, బిట్‌కాయిన్‌ను క్రిప్టో కరెన్సీలలో మదుపు చేస్తే లాభాలంటూ స్నేహితులకు సందేశాలు పంపుతున్నట్లు పేర్కొన్నారు. లాభాలు వచ్చినట్లు కొన్ని ఫొటోలు చూపించి ఆశ కల్పిస్తారని, ఆ సందేశాలు చూసి కొందరు లింకు ద్వారా రూ.లక్షల్లో నగదు పెట్టుబడి పెట్టి నష్టపోతున్నారని తెలిపారు. ముఖ్యంగా టెలిగ్రామ్, ఫేస్‌బుక్‌లలో డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి లింకులు వస్తే అసలు క్లిక్ చేయవద్దని సూచించారు. సైబర్ మోసానికి ఎవరైనా గురైతే వెంటనే సైబర్ క్రైం 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు, అలాగే www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు.