టిమ్స్‌..కిమ్స్‌..నిమ్స్‌ ఉత్తుత్తేనా! | - | Sakshi
Sakshi News home page

టిమ్స్‌..కిమ్స్‌..నిమ్స్‌ ఉత్తుత్తేనా!

Oct 15 2025 6:06 AM | Updated on Oct 15 2025 6:06 AM

టిమ్స

టిమ్స్‌..కిమ్స్‌..నిమ్స్‌ ఉత్తుత్తేనా!

● నాటి హామీలను గాలికొదిలిన చంద్రబాబు ● కర్నూలు జీజీహెచ్‌పై శీతకన్ను ● వైఎస్సార్‌సీపీ హయాంలో నాడు–నేడు కింద రూ.500 కోట్లతో పనులకు శ్రీకారం ● చివరి దశలో కూటమి ప్రభుత్వం రాకతో నిలిచిన పనులు

● నాటి హామీలను గాలికొదిలిన చంద్రబాబు ● కర్నూలు జీజీహెచ్‌పై శీతకన్ను ● వైఎస్సార్‌సీపీ హయాంలో నాడు–నేడు కింద రూ.500 కోట్లతో పనులకు శ్రీకారం ● చివరి దశలో కూటమి ప్రభుత్వం రాకతో నిలిచిన పనులు

కర్నూలు(హాస్పిటల్‌): రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం మొదటిసారి స్వాతంత్య్ర దినోత్సవాలను కర్నూలులో నిర్వహించింది. అప్ప ట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను రిమ్స్‌(రాయలసీమ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌)/కిమ్స్‌(కర్నూలు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌)/టిమ్స్‌(తుంగభద్ర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌)గా మారుస్తామని హామీ ఇచ్చారు. పదేళ్లయ్యింది. ఇప్పటిదాకా దీనికి ఎలాంటి అడుగూ పడలేదు. ఇప్పుడు ఏకంగా దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీని వెంటబెట్టుకుని కర్నూలు వస్తున్నారు. ఇప్పటికై నా కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల అభివృద్ధిపై దృష్టి సారిస్తారా లేదా ఎప్పటిలాగే హామీలు ఇచ్చి వదిలేస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రూ.22.70 కోట్లు ఇస్తే భవనాలు

అందుబాటులోకి..

ఐపీ భవన నిర్మాణానికి రూ.60.5 కోట్లు ఖర్చు అయితే అప్పట్లో రూ.42 కోట్లు చెల్లించారు. ఇంకా రూ.18.5 కోట్లు పెండింగ్‌లో ఉంది. లెక్చరర్‌ గ్యాలరీకి, ఎగ్జామినేషన్‌ హాలుకు పనులు జరుగుతుండగానే బిల్లులు చెల్లించారు. ఎగ్జామినేషన్‌ హాలు పూర్తయి అందుబాటులోకి వచ్చింది. గత టీడీపీ ప్రభుత్వంలో ఆగిపోయిన డ్రగ్‌ కంట్రోల్‌ భవనానికి కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పూర్తి చేయించింది. కానీ ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.46 లక్షల బిల్లులు పెండింగ్‌ పెట్టింది. దీంతో కాంట్రాక్టర్‌ దానిని ఇంకా అప్పగించలేదు. ఐపీడీకి రూ.18.5కోట్లు, లెక్చరర్‌ గ్యాలరికి 2.95కోట్లు, ఎగ్జామినేషన్‌ హాలుకు రూ.79లక్షలు, డ్రగ్‌ కంట్రోల్‌ భవనానికి రూ.46 లక్షలు కలిపి మొత్తం రూ.22.70 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని చెల్లిస్తే భవనాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

కీలకంగా ఇన్‌పేషెంట్‌ భవనం

ఆసుపత్రిలో ఇన్‌ పేషెంట్‌ భవనం కీలకంగా మారింది. ఈ భవనం నిర్మాణం కోసం అప్పట్లో పాత భవనాలన్నీ ఖాళీ చేయించి వాటిని ఇతర వార్డుల్లో సర్దుబాటు చేశారు. 2023లో భవన నిర్మాణ పనులు శరవేగంగా జరిగాయి. ఆరు నెలల కాలంలోనే సెల్లార్‌, గ్రౌండ్‌ ఫ్లోర్‌, ఫస్ట్‌ఫ్లోర్‌ వరకు పిల్లర్లు, గోడలు లేచాయి. మరో ఏడాది ఉంటే భవన నిర్మాణం మొత్తం పూర్తయ్యేది. ఈలోగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పనులు ఆగిపోయాయి. 80వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ ప్లస్‌ ఫోర్‌లో నిర్మాణమయ్యే ఈ భవనం పూర్తయితే సెల్లార్‌లో పెద్ద సంఖ్యలో కార్లు, బైక్‌లు పార్కింగ్‌ చేసుకునే అవకాశం ఉంది. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో టీబీసీడీ వార్డు, గేరియాట్రిక్‌ (వృద్ధులకు)వార్డు, మొదటి అంతస్తులో ఈఎన్‌టీ విభాగం, ఫిమేల్‌ ఆర్థోపెడిక్‌ విభాగం, మేల్‌ ఆర్థోపెడిక్‌ విభాగం, రెండవ అంతస్తులో సైకియాట్రిక్‌ వార్డు, జనరల్‌ సర్జరీ విభాగం, మూడో ఫ్లోర్‌లో డీవీఎల్‌ విభాగం, జనరల్‌ మెడిసిన్‌ విభాగం, 4వ అంతస్తులో పోస్టు ఆపరేటివ్‌ వార్డు, రికవరీ వార్డు, ఐసీయూ, ఐసీసీయూ, ఎంఐసీయూతో పాటు 14 ఆపరేషనన్‌ థియేటర్లు ఇందులో అందుబాటులోకి వస్తాయి. అలాగే కొద్దిపాటి నిధులు విడుదల చేస్తే మెడికల్‌ కాలేజీలోని లెక్చరర్‌ గ్యాలరీ, ఎగ్జామినేషన్‌ హాలు, డ్రగ్‌ కంట్రోల్‌ డిపార్ట్‌మెంట్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

నిమ్స్‌ తరహాలో తీర్చిదిద్దితే..

వైఎస్సార్‌సీపీ హయాంలో

అప్పటి ప్రభుత్వం నాడు–నేడు పథకం కింద నిధులు కేటాయించి అన్ని బోధనాసుపత్రులను అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టింది. కర్నూలు మెడికల్‌ కాలేజీ, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలల అభివృద్ధికి రూ.500 కోట్లకు అప్పట్లో అడ్మినిస్ట్రేషన్‌ శాంక్షన్‌ ఇచ్చింది. ఇందులో రూ.350 కోట్లు భవనాలకు, రూ.150 కోట్లు పరికరాలకు కేటాయించారు. భవనాల్లో భాగంగా ఆసుపత్రిలో ఇన్‌ పేషంట్‌ డిపార్ట్‌మెంట్‌ భవనం, అవుట్‌ పేషెంట్‌ డిపార్ట్‌మెంట్‌, అధునాతన క్యాజువాలిటీ, మోడరన్‌ మార్చురీ, బయోమెడికల్‌ వేస్ట్‌ షెడ్డు, మెడికల్‌ కాలేజీలో అడ్మినిస్ట్రేటివ్‌ బిల్డింగ్‌, లెక్చరర్‌ గ్యాలరీల నిర్మాణాలు చేపట్టేలా ప్రణాళిక రూపొందించారు. ముందుగా ఆసుపత్రిలో ఐపీడీ, కళాశాలలో ఎగ్జామినేషన్‌ హాల్‌, లెక్చరర్‌ గ్యాలరీల నిర్మాణాలు కొనసాగాయి.

హైదరాబాద్‌లోని నిమ్స్‌ తరహా ఆసుపత్రిగా కర్నూలు జీజీహెచ్‌ను తీర్చిదిద్దుతామని పదేళ్ల క్రితం చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. అప్పట్లో ఐదేళ్లు ఆ పార్టీ నాయకులు ఈ మాట చెబుతూనే వచ్చినా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. నిమ్స్‌ తరహాలో ఈ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తే రాయలసీమకు తలమానికంగా మారుతుంది. అత్యాధునిక వైద్యసేవలు, స్పెషాలిటీ, సూపర్‌స్పెషాలిటీ బ్లాక్‌లలో అత్యాధునిక వైద్యపరికరాలతో రోగులకు కార్పొరేట్‌ స్థాయి వైద్యసేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన తర్వాత కర్నూలులో ఏర్పాటవుతుందనుకున్న రిమ్స్‌ హాస్పిటల్‌ను అమరావతికి తరలించుకుపోవడంతో ఇక్కడి ప్రజల ఆశలు నీరుగారిపోయాయి. ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్రమోదీ మొదటి రాజధాని కర్నూలుకు వస్తున్నందున ఆయనైనా ఆసుపత్రి రూపురేఖలు మార్చేందుకు ఏదైనా ప్రకటన చేస్తారని ఇక్కడి ప్రజలు ఎదురుచూస్తున్నారు.

టిమ్స్‌..కిమ్స్‌..నిమ్స్‌ ఉత్తుత్తేనా! 1
1/1

టిమ్స్‌..కిమ్స్‌..నిమ్స్‌ ఉత్తుత్తేనా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement