
రమ్మన్నారు.. వద్దన్నారు!
● ఉపాధ్యాయ నియామక పత్రాల కోసం
అమరావతికి పిలుపు
● బయలుదేరేముందు కార్యక్రమం రద్దు
అంటూ సమాచారం
పాములపాడు: కూటమి ప్రభుత్వం అంతా ఆర్భాటం చేస్తోంది. చివరికి తూచ్ అంటోంది. డీఎస్సీలో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికై న వారికి ఈనెల 19న అమరావతిలో నియామక పత్రా లు అందజేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందు కోసం ఏపీఎస్ ఆర్టీసీ బస్సులను కేటాయించింది. మార్గమధ్యలో భోజనాల కోసం కాంట్రాక్ట్ ఇచ్చింది. అయితే బస్సులు అమరావతికి బయలుదేరే ముందు కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అప్పటికే వివిధ ప్రాంతాల్లో చేసిన ఏర్పాట్ల ఖర్చు వృథా అయ్యింది. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి వచ్చే 2,000 మంది కోసం స్థానిక ఏఎన్‌ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద భోజనాలు సిద్ధం చేశారు. కార్యక్రమం రద్దు అని తెలియడంతో అప్పటికే వండిన భోజనాన్ని పలు పాఠశాలలకు సరఫరా చేశారు. మిగిలినది పడేసి వంట పాత్రలు సర్దుకుని కాంట్రాక్ట్ సిబ్బంది వెనుదిరిగారు. కూటమి ప్రభుత్వం తామే ఉద్యోగాలిచ్చామని గొప్పలు చెప్పుకునేందుకే ఇలాంటి ఆర్భాటాలకు డబ్బు వృథా చేస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పుడూ లేని విధంగా నియామక పత్రాలు అమరావతిలో ఇవ్వాల్సిన అవసరమేముందని పలువురు ప్రశ్నిస్తున్నారు.