
దోచుకునేందుకే వైద్య కళాశాలల ప్రైవేటీకరణ
కర్నూలు (టౌన్): ఒక కత్తెర, రిబ్బన్ ఉంటే ప్రారంభించాల్సిన ప్రభుత్వ వైద్య కళాశాలలను సీఎం చంద్రబాబు నాయుడు ప్రైవేటుకు అప్పగించి భారీగా నిధులను దోచుకునేందుకు కుట్ర పన్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి విమర్శించారు. గురువారం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్‌లో పార్టీ నేతలతో కలసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మంచి ఉద్దేశంతో రాష్ట్రంలో ఒకేసారి 17 వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. పేద విద్యార్థులకు వైద్య సీట్లు అందడంతో పాటు పేద రోగులు ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చనే సంకల్పంతో శరవేగంగా నిర్మించారన్నారు. అటువంటి ప్రభుత్వ వైద్య కళాశాలలను మంత్రి లోకేష్ ఆయన బంధువు లు, అనుయాయులు, మంత్రి నారాయణ, కామినేని బినామీ పేర్లతో కట్టబెట్టేందుకు చంద్రబాబు నాయు డు నిర్ణయించారన్నారు. ప్రభుత్వ కళాశాలల ప్రైవేటీకరణను రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ, సీపీఎం, విద్యార్థి, యువజన సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయన్నారు. అయినా కూటమి ప్రభుత్వం హడావుడిగా పులివెందుల, పాడేరు, మార్కాపురం, ఆదోని ప్రభుత్వ వైద్య కళాశాలలను ఈ– ప్రొక్యూర్‌మెంటు టెండర్లు నిర్వహించి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలు చేయడం దుర్మార్గమన్నారు. కూటమి తీరుకు వ్యతిరేకంగా ఆదోని ప్రభుత్వ వైద్య కళాశాల సందర్శనకు ఈనెల 19వ తేదీన ‘చలో ఆదోని’ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ పిలుపునిచ్చిందన్నారు. జిల్లా, నియోజకవర్గ పార్టీ శ్రేణులు, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
బాబూ.. సంపద సృష్టించలేవా?
ఎన్నికల ముందు సంపద సృష్టించి అభివృద్ధి చేస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుకు అప్పగిస్తుండటం దారుణమని ఎస్వీ మోహన్‌రెడ్డి విమర్శించారు. వాటిని ప్రారంభిస్తే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మంచి పేరు వస్తోందోననే భయంతోనే బాబు పీపీపీ విధానానికి తెరలేపారన్నారు. ఏడాదిన్నర వ్యవధిలో రూ.2 లక్షల కోట్లు అప్పులు చేసిన ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే అందులో రూ.5 వేల కోట్లు ఖర్చు పెడితే రాష్ట్రంలో పేదలకు వైద్య విద్య, వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.
విద్య, వైద్య రంగాలు సర్వనాశనం..
కూటమి పాలనలో విద్య, వైద్య రంగాలు సర్వనాశనం అయ్యాయని వైఎస్సార్‌సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సిద్ధారెడ్డి రేణుక విమర్శించారు. గత ప్రభుత్వం నాడు – నేడు కార్యక్రమం కింద మున్సిపల్, ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దితే, కూటమి ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేస్తుందన్నారు. వెనుకబడిన ప్రాంతం ఆదోనిలో జగనన్న ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తే చంద్రబాబు నాయుడు ప్రైవేటుకు అప్పగిస్తుండటం సిగ్గుచేటన్నారు. ‘చలో ఆదోని’ కార్యక్రమానికి మహిళలు పెద్ద సంఖ్యలో తరలిరావాలన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు షరీఫ్, శివారెడ్డి, కార్పొరేటర్లు విక్రమసింహారెడ్డి, క్రిష్ణకాంత్ రెడ్డి, తిరుమలేశ్వర రెడ్డి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు వ్యతిరేకిస్తున్నా..
ప్రభుత్వం టెండర్లకే మొగ్గు
ప్రైవేటుకు అప్పగిస్తే పనులను
అడ్డుకుంటాం
నేడు ‘చలో ఆదోనికి’
భారీగా తరలిరండి
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
ఎస్వీ మోహన్ రెడ్డి