
డంప్‌యార్డుకు 1,818 క్వింటాళ్ల ఉల్లిగడ్డలు
కర్నూలు(అగ్రికల్చర్): మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసిన ఉల్లికి వేలంపాట నిర్వహించగా 1,818 క్వింటాళ్ల ఉల్లిగడ్డలను ఎవ్వరూ కొనుగోలు చేయలేదు. జాయింట్ కలెక్టర్ నవ్య ఆదేశాల మేరకు గరువారం నిర్వహించిన వేలంపాటలో 4905.45 క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేశారు. క్వింటాకు కనిష్ట ధర రూ.50 మాత్రమే లభించింది. గరిష్టంగా రూ.400తో కొన్నారు. 1,818 క్వింటాళ్ల ఉల్లిగడ్డలను కనీస ధరతో కూడా కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో గార్గేయపురం వద్దనున్న డంప్ యార్డుకు తరలించనున్నారు. కాగా శుక్రవారం కూడా కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉల్లి క్రయవిక్రయాలు జరగవని సెక్రటరీ జయలక్ష్మి తెలిపారు. కర్నూలు మార్కెట్‌లో ఉల్లి విక్రయా లు లేనందున ఎమ్మిగనూరు మార్కెట్ యార్డు లో కొనుగోళ్లు చేశారు. 18 మంది రైతులు ఉల్లి దిగుబడులను తెచ్చారు. జాయింట్ కలెక్టర్ నవ్య, మార్కెటింగ్ శాఖ జేడీ రామాంజనేయులు ఉల్లి విక్రయాలను పరిశీలించారు.
నేడు ఎమ్మిగనూరు, రేపు కర్నూలులో ఉల్లి కొనుగోళ్లు
కర్నూలు(సెంట్రల్): ఈనెల 19వ తేదీన ఎమ్మిగనూరులో, 20వ తేదీన కర్నూలు మార్కెట్ యార్డుల్లో ఉల్లిని కొనుగోలు చేయనున్నట్లు జేసీ డాక్టర్ బి.నవ్య గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రైతులు ఆయా తేదీల్లో మార్కెట్లకు ఉల్లిని తీసుకురావాలని సూచించారు.
2,183 కుటుంబాలకు అందని దీపం లబ్ధి
కర్నూలు(సెంట్రల్): జిల్లాలో సాంకేతిక కారణాలతో 2,186 కుటుంబాలు దీపం–2 పథకం లబ్ధిని అందుకోలేకపోయారని డీఎస్‌ఓ ఎం.రాజారఘువీర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్, ఎన్‌పీసీఐ లింకు కాకపోవడం, బ్యాంకు ఖాతా మనుగడలో లేకపోవడం తదితర కారణాలతో ఎక్కువ మందికి దీపం–2 పథకం లబ్ధి కలుగలేదన్నారు. సంబంధిత ఖాతాదారులు సాంకేతిక కారణాలను పరిష్కరించుకోవాలని ఆయన పేర్కొన్నారు.
పాత నేరస్థులపై మొబైల్ సెక్యూరిటీ డివైజ్‌తో నిఘా
కర్నూలు: జిల్లాలో దోపిడీ దొంగలు, గంజాయి స్మగ్లర్ల కదలికలు బయటపడటంతో పోలీసు శాఖ పాత నేరస్థులపై ప్రత్యేక దృష్టి సారించింది. పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న నేరగాళ్లను గుర్తించేందుకు గస్తీ పోలీసులు మొబైల్ సెక్యూరిటీ డివైజ్‌తో వేలిముద్రలు సేకరిస్తూ నిఘాను తీవ్రతరం చేశారు. పాత నేరస్థుల జాబితాతో వేలిముద్రను పోల్చి చూసి విచారిస్తున్నారు. విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా బుధవారం రాత్రి జిల్లా అంతటా విస్తృత తనిఖీలు నిర్వహించారు. నేరాల కట్టడికి నిఘాతో పాటు రోడ్డు సేఫ్టీ నియమాలపై కూడా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గస్తీ పోలీసులు చర్యలు చేపట్టారు.
ఉద్యోగులకు
బయోమెట్రిక్ హాజరు
● నూతన సీఎఫ్‌గా బాధ్యతలు
స్వీకరించిన ఐఎఫ్‌ఎస్ బీవీఏ కృష్ణమూర్తి
కర్నూలు కల్చరల్: ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేస్తామని కర్నూలు సర్కిల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (సీఎఫ్)గా ఐఎఫ్‌ఎస్ బీవీఏ కృష్ణమూర్తి తెలిపారు. ఇటీవల చేపట్టిన ఐఎఫ్‌ఎస్‌ల బదిలీల్లో శ్రీశైలం ప్రాజెక్ట్ టైగర్ సర్కిల్ ఫీల్డ్ డైరెక్టర్‌గా ఉన్న ఆయనను కర్నూలుకు బదిలీ చేశారు. ఆ మేరకు సీఎఫ్‌గా గురువారం బాధ్యతలు చేపట్టారు. నూతన సీఎఫ్‌గా బాధ్యతలు చేపట్టిన కృష్ణమూర్తికి నంద్యాల, కర్నూలు, కడప డీఎఫ్‌వోలు, రేంజ్ ఆఫీసర్లు, సర్కిల్ కార్యాలయం ఏఈవోలు ఉద్యోగులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ ఉద్యోగులందరూ నిబంధనల ప్రకారం బాధ్యతలను నిర్వర్తించాలన్నారు. అటవీ శాఖ కార్యాలయాలన్నీ సీసీ టీవీ పర్యవేక్షణలో ఉంటాయన్నారు. ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని, అయితే విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించాలన్నారు.

డంప్‌యార్డుకు 1,818 క్వింటాళ్ల ఉల్లిగడ్డలు