
బార్ల కేటాయింపు రెండో అంకం పూర్తి
కర్నూలు: జిల్లాలో బార్ల కేటాయింపు రెండో అంకం ముగిసింది. గడువు పెంచిన (రీ నోటిఫికేషన్) ఏడు బార్లకు గాను గురువారం జిల్లాపరిషత్ సమావేశ భవనంలో ఐదు బార్లకు లాటరీ తీశారు. రెండో దశలో ఐదు బార్లకు నాలుగేసి దరఖాస్తులు రాగా వాటికి లాటరీ తీసి ప్రొవిజినల్ లైసెన్సులు జారీ చేశారు. ఇన్‌చార్జి కలెక్టర్ బి.నవ్య, జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు పర్యవేక్షణలో పోటీదారుల సమక్షంలో లాటరీ తీసి విజేతలకు కేటాయించారు. అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు, ఏఈఎస్‌లు రామకృష్ణా రెడ్డి, రాజశేఖర్ గౌడ్, సీఐలు చంద్రహాస్, రమేష్ రెడ్డి, రాజేంద్రప్రసాద్, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలో మొత్తం 26 బార్లు ఉన్నాయి. వీటికి గత నెల 18న మొదటి విడత నోటిఫికేషన్ విడుదల కాగా, 19 బార్లకు నాలుగేసి దరఖాస్తులు రావడంతో గత నెల 30వ తేదీ లక్కీ డిప్ నిర్వహించి విజేతలకు కేటాయించారు. ఏడు ఓపెన్ కేటగిరీ బార్లకు స్పందన కరువవ్వడంతో ఈ నెల 3వ తేదీన రీ నోటిఫికేషన్ ఇచ్చారు. అందులో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 4, ఎమ్మిగనూరు మున్సిపాలిటీ పరిధిలో 2, గూడూరు నగర పంచాయతీలో ఒక బార్‌కు మొదటి విడతలో దరఖాస్తులు రాకపోవడంతో రీ నోటిఫికేషన్ ఇచ్చి నిబంధనల ప్రకారం దరఖాస్తులు వచ్చిన ఐదింటికి లక్కీడిప్ తీసి లబ్ధిదారులకు కేటాయించారు. పోటీ పడితే ప్రస్తుత పరిస్థితుల్లో గిట్టుబాటు కాదని వ్యాపారులు కూడబలుక్కుని ఒక్కరే నాలుగేసి దరఖాస్తులు వేసి కొందరు బార్లు దక్కించుకున్నారు. నిబంధనల మేరకు 6వ వంతు వార్షిక లైసెన్స్ రుసుం అదనపు ఆర్‌ఈటీ మొత్తాన్ని డీడీ రూపంలో చెల్లించారు. వెంటనే వ్యాపారాలు మొదలుపెట్టుకోవటానికి ఎకై ్సజ్ అధికారులు ప్రొవిజన్ లైసెన్స్ (తాత్కాలిక) జారీ చేశారు. చట్టపరమైన లాంఛనాలు అన్నీ పూర్తయిన తర్వాత ఎకై ్సజ్ అధికారులు బార్ ప్రదేశాన్ని తనిఖీ చేసి శాశ్వత లైసెన్స్ మంజూరు చేస్తారు. రెండు విడతల్లో 24 బార్లకు అధికారులు అనుమతులు ఇచ్చారు. ఎమ్మిగనూరు మున్సిపాల్టీ, గూడూరు నగర పంచాయతీ పరిధిలోని బార్లకు ఒక్క దరఖాస్తూ రాలేదు. వాటికి మరోసారి రీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. దరఖాస్తుల ద్వారా దాదాపు రూ.5.15 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. దరఖాస్తుల ఖరారు విషయంలో కర్నూలు జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచిందని ఈఎస్ సుధీర్ బాబు తెలిపారు.
ఐదు బార్లకు
ప్రొవిజినల్ లైసెన్సులు జారీ
ఎమ్మిగనూరు, గూడూరు బార్లకు
స్పందన కరువు
మరోసారి నోటిఫికేషన్
విడుదల చేయనున్న అధికారులు