
డాక్యుమెంట్ రైటర్లు నేడు, రేపు పెన్‌డౌన్!
కర్నూలు(సెంట్రల్): కూటమి ప్రభుత్వ వైఖరితో డాక్యుమెంట్ రైటర్లు పెన్‌డౌన్‌కు పిలుపునిచ్చారు. సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతో రెండు రోజులపాటు సేవలను నిలిపేసి నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించారు. శుక్ర, శనివారాల్లో డాక్యుమెంట్ల తయారీకి ఒప్పుకోమని నోటీసులిచ్చారు. దీంతో రిజిస్ట్రేషన్ సేవలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. సేవలు స్తంభించి పోయే ప్రమాదం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం గమనార్హం.
లోపాలను సరిదిద్దాలని కోరినా..
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 24 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. డాక్యుమెంట్ల తయారీలో రైటర్లదే కీలకపాత్ర. అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్లు డాక్యుమెంట్ తయారీ చేసి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నివేదిస్తే నంబర్ వేసి అధికారులు రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌ను కానిస్తారు. అయితే కూటమి ప్రభుత్వ తీరుతో డాక్యుమెంట్ తయారీలో కొన్ని లోపాలు ఉన్నాయి. వాటిని సరిచేయాలని కోరుతున్నా పట్టించుకోవడంలేదు. కార్డు ప్రైమ్ 2.0లో ఆధార్ ఓటీపీ విధానాన్ని తీసుకొచ్చారు. ఈ విధానంలో కొనుగోలుదారులు నాలుగుసార్లు, విక్రయించే వారు మూడు సార్లు ఓటీపీ చెప్పాలి. కొందరు విక్రయదారులు ఓటీపీ చెప్పడానికి సంకోచిస్తున్నారు. చెప్పేందుకు ముందుకు వచ్చిన వారికి తీవ్ర సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆధార్ ఆధారిత ఓటీపీ సెల్‌ఫోన్‌కు వచ్చేలోపు టైమ్ అవుట్ అవుతుండడంతో మళ్లీ మొదటి నుంచి రావాల్సి వస్తోంది. ఇలా ఒక్క డాక్యుమెంట్‌లో మొత్తం 7 ఓటీపీలు వచ్చేలోపు దాదాపు 30–45 నిమిషాల సమయం పడుతుంది. అలాగే పీడీఈ(పబ్లిక్ డేటా ఎంట్రీ)విధానాన్ని కూడా పూర్తిగా రైటర్ చేయాల్సి వస్తోంది. దీనిని సబ్ రిజిస్ట్రార్ తన లాగిన్‌లో చేసుకోవాల్సి ఉన్నా పట్టించుకోవడంలేదు. దీంతో పీడీఈ నమోదులో తీవ్ర తప్పులు, అలసత్వం నెలకొంటోంది. మరోవైపు మ్యుటేషన్ ప్రక్రియను కూడా రైటర్లే పూర్తి చేయాలని సూచిస్తుండడంతో ఏమైనా తప్పులు దొర్లితే తాము బాధ్యులు కావాల్సి వస్తోందని రైటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్లు, వారి సిబ్బంది చేసుకోవాల్సిన పనులను తమతో చేయిస్తుండడంతో తీవ్ర పనిభారం, సమయం వెచ్చించాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. ఆయా సమస్యలను పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో పెన్‌డౌన్‌కు సిద్ధమయ్యారు. ఈక్రమంలో శుక్ర, శని వారాల్లో పెన్ డౌన్ కార్యక్రమాన్ని చేపడుతుండడంతో రిజిస్ట్రేషన్ సేవలు స్తంభించిపోయే అవకాశం ఉంది.
ప్రభుత్వ నిర్ణయంతో డాక్యుమెంట్ల
రూపకల్పనలో తీవ్ర ఇబ్బందులు
మ్యుటేషన్, ఆధార్ ఓటీపీ,
పీడీఈ భారాన్ని రైటర్లపై నెట్టడంతో
అభ్యంతరం
పలుమార్లు విన్నవించినా
పట్టించుకోని ప్రభుత్వం