
కర్నూలు జిల్లా ఆరేకల్ వద్ద విద్యార్థిని జుట్టు పట్టుకుని లాక్కెళ్తున్న పోలీసులు
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వెల్లువెత్తిన ఆందోళనలు
కర్నూలు జిల్లా ఆరేకల్ వద్ద విద్యార్థులపై పోలీసుల దాష్టీకం
ఆదోని టౌన్/ఆదోని రూరల్/సాక్షి, అనకాపల్లి: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న విద్యార్థులపై రాష్ట్ర ప్రభుత్వం జులుం ప్రదర్శిస్తోంది. పోలీసులను ఉసిగొల్పి రోడ్డెక్కితే ఖబడ్దార్ అంటూ హెచ్చరికలు జారీ చేస్తోంది. కర్నూలు జిల్లా ఆదోని మండలం ఆరేకల్ సమీపంలో మెడికల్ కళాశాల వద్ద గురువారం విద్యార్థి, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
కళాశాల ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలని ఏఐఎస్ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ సంఘాల నేతలు, విద్యార్థినులు నినదించారు. కాలేజీకి చేరుకున్న పోలీసులు విద్యారు్థలను జుట్టుపట్టి ఈడ్చేశారు. కాలర్ పట్టుకుని కొట్టినంత పనిచేసి లాక్కెళ్లారు. పోలీసులపై దాడి చేశారని.. జీపు డోర్‌ను ధ్వంసం చేశారని పేర్కొంటూ 10 మంది విద్యార్థి నాయకులపై కేసులు నమోదు చేశారు.
దర్నాను అడ్డుకున్న పోలీసులు
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో తలపెట్టిన శాంతియుత నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. గురువారం నర్సీపట్నం నియోజకవర్గ పరిధిలోని భీమభోయినపాలెంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో శాంతియుత ధర్నాకు వైఎస్సార్‌సీపీ పిలుపునిచ్చింది.
ధర్నాకు బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, పార్టీ లీగల్ సెల్ ప్రతినిధి మాకిరెడ్డి బుల్లిదొరతో పాటు 20 మంది వైఎస్సార్‌సీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిరసన కార్యక్రమానికి నలుమూలల నుంచి బయలుదేరిన వైఎస్సార్‌సీపీ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేష్ మాట్లాడుతూ.. పోలీసులతో అరెస్ట్ చేయించినా.. కేసులు నమోదు చేసినా నర్సీపట్నం మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకునేవరకూ పోరాడుతూనే ఉంటామని హెచ్చరించారు.