ఈవ్‌టీజింగ్‌పై ప్రత్యేక నిఘా
కర్నూలు(టౌన్): జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కళాశాలల వద్ద ఈవ్‌టీజింగ్‌పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. వివిధ పోలీసు స్టేషన్లకు సంబందించిన పోలీసులు యాంటీ ఈవ్‌టీజింగ్ బీట్‌లను తనిఖీ చేశారన్నారు. పలు పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థల వద్ద ఈవ్‌టీజింగ్‌కు పాల్పడే వారిపై నిఘా ఉంచి యువకులకు కౌన్సెలింగ్ నిర్వహించామన్నారు. ఈవ్‌టీజింగ్, ఆకతాయిలతో ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే స్థానిక పోలీసుల దృష్టికి తీసుకురావాలని.. లేదా 112, 100కు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.
పోటీ పరీక్షలు విద్యార్థులకు ఎంతో ఉపయోగం
కర్నూలు(అర్బన్): పోటీ పరీక్షలు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ చైర్మన్ మహమ్మద్ ఫారూక్ షుబ్లీ అన్నారు. ఉర్దూ అకాడమీ 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ఉర్దూ మహోత్సవ్ కార్యక్రమానికి ఆయన గురువారం హాజరై పోటీ పరీక్షల్లో విజేతలైన విద్యార్థినీ, విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో వివిధ అంశాలపై పోటీ పరీక్షలను నిర్వహించడం వల్ల విద్యార్థుల్లోని ప్రతిభను వెలుగులోకి తెచ్చిన వారమవుతామన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఐడీయల్ స్కూల్, యునానీ కళాశాలను సందర్శించారు. అలాగే ఉస్మానియా కళాశాలలో నిర్వహించిన ప్రపంచ అరబిక్ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ డైరెక్టర్ గౌస్ పీర్, హజ్ కమిటీ డైరెక్టర్ మన్సూర్ అలీఖాన్, వక్ఫ్ కాంప్లెక్స్ కమిటీ ప్రెసిడెంట్ ఇబ్రహీం, ఆల్ ఇండియా ముస్లిం మైనారిటీ కౌన్సిల్ చైర్మన్ మహమ్మద్ పీర్, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారిణి సయ్యద్ సబీహా పర్వీన్ తదితరులు పాల్గొన్నారు.
రేపటి నుంచి డోర్ డెలివరీ ప్రచార మాసోత్సవాలు
కర్నూలు సిటీ: ఏపీఎస్ ఆర్టీసీ ఆధ్వర్యంలో రేపటి(శనివారం) నుంచి డోర్ డెలివరీ ప్రచార మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి టి.శ్రీనివాసులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించడంలో భాగంగా ఆర్టీసీలో పార్సిల్స్ ఇంటి వద్దకే చేరవేస్తామన్నారు. జిల్లా పరిధిలోని అన్ని ఆర్టీసీ బస్టాండ్ల కార్గో కౌంటర్ల ద్వారా రాష్ట్రంలోని 87 ముఖ్య పట్టణాలకు 50 కేజీల వరకు 10 కి.మీ పరిధిలో పార్సిల్స్ బుక్ చేసి త్వరితగతిన డోర్ డెలివరీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మద్దతు ధరతో
కందుల కొనుగోలు
కర్నూలు(అగ్రికల్చర్): ఈ ఏడాది రబీలో పండించిన కందులను మార్క్‌ఫెడ్ ద్వారా నేషనల్ కో–ఆపరేటివ్ కన్జూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మద్దతు ధరతో కొనుగోలు చేయనుంది. కర్నూలు జిల్లాలో 14,788 టన్నులు, నంద్యాల జిల్లాలో 25,875 క్వింటాళ్లు మద్దతు ధర రూ.8వేలతో కొనుగోలు చేయనుంది. నంద్యాల జిల్లాలో మినుములు కూడా 11,254 టన్నులు కొనుగోలు చేయనుంది. నేషనల్ కో–ఆపరేటివ్ కన్జూమర్స్ పెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌కు మార్క్‌ఫెడ్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. మార్కెట్‌లోకి దాదాపు నెల రోజులుగా కందులు వస్తున్నాయి. మద్దతు ధరతో కొనుగోలు చేయడంలో చంద్రబాబు సర్కార్ విఫలమైంది. మద్దతు ధర రూ.8వేలు ఉండగా.. మార్కెట్‌లో రైతులకు గరిష్టంగా రూ.7 వేల వరకే ధర లభిస్తోంది. దీంతో రైతులు నష్టపోతున్నారు. ఎట్టకేలకు నేషనల్ కో–ఆపరేటివ్ కన్జూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మద్దతు ధరతో కొనుగోళ్లు చేయనుండటంతో రైతులు ఊరట చెందుతున్నారు. జిల్లాలోని 16 మండలాల్లో కంది సాగు ఎక్కువగా ఉంది. ఈ మండలాల్లోని ఆర్‌బీకేల వారీగా కందులు కొనుగోలు చేయనున్నారు. కంది సాగు తక్కువగా ఉన్న మండలాల రైతులు పక్క మండలంలో అమ్ముకోవచ్చని మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ జి.రాజు తెలిపారు. ఖరీఫ్‌లో కంది సాగు చేసి ఈ–క్రాప్‌లో నమోదు చేసుకున్న రైతులు సంబంధిత ఆర్‌బీకేల్లో పేర్లు నమోదు చేయించుకోవాలని సూచించారు.
ఈవ్‌టీజింగ్‌పై ప్రత్యేక నిఘా


