బిల్లు తీసుకోవడం తప్పనిసరి
కర్నూలు(సెంట్రల్): వినియోగదారులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని, కొనుగోలు చేసే ప్రతి వస్తువు, సేవకు సంబంధించిన బిల్లు తీసుకోవాలని జేసీ నూరుల్ ఖమర్ సూచించారు. గురువారం జాతీయ వినియోగదారుల దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా వినియోగదారుల హక్కులు, బాధ్యతలపై ప్రజల అవగాహనకు నగరంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని జేసీ నూరుల్ ఖమర్ గాయత్రీ ఎస్టేట్‌లోని జూనియర్ కాలేజీ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం డిసెంబర్ 24ని జాతీయ వినియోగదారుల దినోత్సవం నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా వినియోగదారులను చైతన్య పరచేందుకు వారం రోజులపాటు అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నట్లు చెప్పారు. మోసపూరిత ప్రకటనలు, అధిక ధరలు, నాణ్యతలేని వస్తువులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. వినియోగదారులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా ఫోరమ్‌లను ఆశ్రయించాలని సూచించారు. కార్యక్రమంలో వినియోగదారుల ఫోరం జిల్లా చైర్మన్ కరణం కిశోర్‌కుమార్, సభ్యులు నారాయణరెడ్డి, కౌసర్ డేగం, డీఎస్‌ఓ రాజారఘువీర్, వినియోగదారుల ఫోరం సెక్రటరీ శివ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.


