రివ్యూ పిటిషన్ వేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం
కర్నూలు(సెంట్రల్): టీచర్లకు ఇన్‌సర్వీసు టెట్ అంశంపై సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని.. కేంద్రం, రాష్ట్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా టెట్ నిర్వహణపై మోసపూరిత ప్రకటనలు చేశాయ ని యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షుడు కె.సురేష్‌కుమార్ మండిపడ్డారు. గురువారం కలెక్టరేట్ ఎదుట యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సమస్యలపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇన్‌సర్వీసు టీచర్లకు టెట్ రద్దు డిమాండ్‌తో వచ్చే నెల 2, 3 తేదీల్లో విజయవాడలో, 29న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో ధర్నా చేపడతామన్నారు. 2010 కంటే ముందు రిక్రూట్ అయిన ఉపాధ్యాయులకు టెట్ అవసరంలేదన్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులను బోధనేతర పనులకు వినియోగించకూడదని చెబుతున్నా ఎందుకు వారి సేలను తీసుకుంటున్నారని ప్రశ్నించారు. పదో తరగతి విద్యార్థులకు ఇచ్చిన నూరు రోజుల ప్రణాళికను రద్దు చేయాలని, దాని ప్రకారం పిల్లవాడు చదివే దానికన్నా ఉపాధ్యాయుడు ఆన్‌లైన్‌లో ఫొటోలు అప్‌లోడ్ చేసేదే ఎక్కువగా ఉందన్నారు. ప్రతి టీచర్‌కు తన సబ్జెక్టుపై ప్రణాళిక ఉంటుందని, దానిని అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రవికుమార్, నవీన్‌పాటి తదితరులు పాల్గొన్నారు.


