రైతులను నట్టేట ముంచిన కావేరి సీడ్స్
కర్నూలు(అగ్రికల్చర్)/కర్నూలు(సెంట్రల్): నకిలీ విత్తనాలతో కావేరీ సీడ్ కంపెనీ రైతులను నట్టేట ముంచిందని మండల కేంద్రమైన గోనెగండ్ల రైతులు కిసాన్ మోర్చ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్‌కు వచ్చి జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మికి ఫిర్యాదు చేశారు. అంతకు ముందు కలెక్టరేట్ ఎదుట రైతుల పక్షాన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గీత మాధురి మాట్లాడుతూ గోనెగండ్ల, నందవరం, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం తదితర మండలాల రైతులు కావేరీ సీడ్ కంపెనీ ద్వారా దాదాపు 500 ఎకరాల్లో మొక్కజొన్న విత్తనోత్సత్తి చేపట్టారన్నారు. ఎకరాకు రూ.50 వేల వరకు పెట్టుబడి వచ్చిందన్నారు. ఎకరాకు కనీసం 25 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఆశించినా, కిలో కూడా దిగుబడి లేకపోవడంతో కావేరీ సీడ్ కంపెనీ నకిలీ విత్తనాలతో మోసం చేసిందని గుర్తించారన్నారు. ఆయా మండలాల్లో వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోయిందన్నారు. రైతులను నకిలీ విత్తనాలతో మోసం చేసిన కావేరీ సీడ్ కంపెనీపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, ఎకరాకు రూ.లక్ష ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని కిసాన్ మోర్చా నేతలు డిమాండ్ చేశారు. కార్యక్రమలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఈరన్న, నాయకులు మాలతి, మురళీనాయుడు, త్రివిక్రమ్, సాయి ప్రసాద్ పాల్గొన్నారు.
రైతులను నట్టేట ముంచిన కావేరి సీడ్స్
రైతులను నట్టేట ముంచిన కావేరి సీడ్స్


