బాబూ.. ఇవేం లెక్కలు!
మార్కెట్లలో వెల‘విల’
లెక్కల్లో కళకళ
కొత్త పరిశ్రమలు లేవు
గణాంకాల్లో అబద్ధం
కర్నూలు జిల్లాలో 2023–24 నుంచి 2025–26 వరకు జీడీవీఏ ఇలా ఉంది.
సేవా రంగం నిస్తేజం!
పంటలు పండక రైతులు అప్పుల్లో ఉన్నారు
జీడీడీపీ
చాలా
ఎక్కువగా ఉంది
కర్నూలు(అగ్రికల్చర్): జీడీవీఏ (జిల్లా స్థూల విలువ జోడింపు)ను పరిశ్రమలు, వ్యవసాయం, సేవా రంగాల్లో ఉత్పత్తి నుంచి గణన చేస్తారు. ఈ మొత్తాల నుంచి సబ్సిడీలను తీసేస్తే జీడీడీపీ( జిల్లా స్థూల దేశీయోత్పత్తి) వస్తుంది. రైతులకు సబ్సిడీలు భారీ స్థాయిలో ఇవ్వకుండా, పరిశ్రమలను, సేవారంగాన్ని పట్టించుకోకుండా చంద్రబాబు ప్రభుత్వం జీడీవీఏను అమాంతంగా పెంచింది. అభివృద్ధి, సంక్షేమం లేకుండా అంకెల గారడీ చూపింది.
వాస్తవం ఇదీ..
చంద్రబాబు ప్రభుత్వంలో మొదటి ఏడాది సంక్షేమ పథకాలు అమలు కాలేదు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను 2025–26లో అరకొరగా అమలు చేశారు. సూపర్–6 హామీలు ఇచ్చామని, వాటిని అమలు చేస్తామని ప్రజలకు అభయా న్ని ఇవ్వడం లేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రజల ఆర్థిక పరిస్థితి దిగజారి జీఎస్‌టీ వసూళ్లు పడిపోయాయి. అయినప్పటికీ జీడీవీఏ, జీడీడీపీ అద్భుతంగా పెరిగినట్లు గణాంకాలు సిద్ధం చేశారు. అంకెలను చూసి మురిసిపోవాల్సిందే తప్ప.. క్షేత్రస్థాయిలో అభివృద్ధి, సంక్షేమం కనిపించదు.
దగా చేయడమే లక్ష్యం!
ఉమ్మడి జిల్లాలో ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యంగా ఉందా, లేదా అనే దానిని తెలుసుకోవడానికి స్థూల ఉత్పత్తిని పరిగణనలోకి తీసుకుంటారు. పక్కాగా లెక్కిస్తే జీడీడీపీకి ప్రాధాన్యం ఎంతో ఉంది. అయితే అభివృద్ధి, సంక్షేమాన్ని పక్కనపెట్టి అంకెల గారిడీతో చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను దగా చేస్తోందని విమర్శలు వస్తున్నాయి. జీడీడీపీలో పెరుగుదలకు అధికారులు కుస్తీ పడుతున్నారు. జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో కూడా జీడీడీపీ ఎక్కువ చూపాలని చెప్పడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
జీడీడీపీ రూ.1,12,332 కోట్లట!
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో అంటే 2023–24లో కర్నూలు జిల్లా జీడీడీపీ రూ.48,126 కోట్లు. చంద్రబాబు సర్కార్ ఏర్పాటైన తర్వాత అంటే 2024–25లో జీడీడీపీ రూ.47,362 కోట్లకు పడిపోయింది. అయితే 2025–26లో మాత్రం జీడీడీపీ అమాంతంగా రూ.61,630 కోట్లకు పెరిగిపోయింది. గతేడాది పోలిస్తే ఏకంగా రూ.14,268 కోట్లు పెరిగినట్లు అంకెల వేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అలాగే నంద్యాల జిల్లాలో 50,702 కోట్లు జీడీవీఏ ఉందని లెక్కలు వేశారు. ఈఏడాది వ్యవసాయ ఉత్పాదకత పెరుగకపోగా తగ్గిపోయింది. గత పరిశ్రమలే తప్ప కొత్తవి ఏర్పాటు కాలేదు. సేవారంగంలో సేవలు ఏ మాత్రం పెరుగలేదు. కానీ జీడీడీపీ రూ.1,12,332 కోట్లుగా ప్రకటించుకోవడంపై ముక్కున వేలేసుకునే పరిస్థితి ఏర్పడింది.
అధిక వర్షాలతో 2025–26లో వ్యవసాయ, ఉద్యాన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఫలితంగా కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, నందికొట్కూరు మార్కెట్ యార్డులు వెలవెలబోతున్నాయి. సాధారణంగా మార్చి వరకు మార్కెట్ యార్డులు కిటకిటలాడుతాయి. ఈ సారి దిగుబడులులేక, ధరలు లేక ఖాళీగా ఉంటున్నాయి.
వ్యవసాయ మార్కెట్లకు పంట దిగుబడులు రాకున్నా కర్నూలు జిల్లాలో రూ.18,985 కోట్లు, నంద్యాల జిల్లాలో రూ.20,395 కోట్లు జీడీడీపీ ఉన్నట్లు లెక్కలు వేశారు. రైతన్నా.. మీకోసం అంటూ గత నవంబరు 24 నుంచి 29 వరకు ఇంటింటి కార్యక్రమం నిర్వహించారు. అలాగే ఈ నెల 3న రైతుసేవా కేంద్రాల వారీగా వర్క్‌షాపులు నిర్వహించి జీడీడీపీ లో అంకెల గారిడీ కోసం కసరత్తు చేశారు. దీంతో జీడీడీపీ అమాంతం పెరిగిపోయింది.
చంద్రబాబు ప్రభుత్వంలో 18 నెలలుగా ఉమ్మడి కర్నూలు జిల్లాకు కొత్తగా వచ్చిన పరిశ్రమ ఒక్కటీ లేదు. పత్తికొండలో టమాట ప్రాసెసింగ్ యూనిట్, ఎమ్మిగనూరు మండలంలో టెక్స్‌టైల్ పార్క్‌కు భూమి పూజ చేయడం తప్ప ఎలాంటి పురోగతి లేదు. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్‌లో కొత్తగా ఏర్పాటైన పరిశ్రమలు లేవు. నంద్యాల జిల్లాలో కూడా కొత్తగా ఏర్పాటైన పరిశ్రమలు లేవు.
పారిశ్రామిక రంగంలో అద్భుతమైన జీడీడీపీ సాధించినట్లు లెక్కలు వేశారు. కర్నూలు జిల్లాలో పారిశ్రామిక రంగం ద్వారా జీవీఏ రూ.11,657 కోట్లు, నంద్యాల జిల్లాలో రూ.7,886 కోట్లు ఉన్నట్లు లెక్కలు వేశారు. మొదటి ఆరు నెలల్లో కర్నూలు జిల్లాలో రూ.4.981, నంద్యాల జిల్లాలో రూ.3.914 కోట్ల జీవీఏ సాధించినట్లు లెక్కలు ఉన్నాయి. మిగిలిన జీవీఏను మార్చి నాటికి సాధిస్తారని గణాంకాల్లో చూపారు.
వైఎస్సార్‌సీపీ హయాంలో ఇలా..
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చింది. గ్రామాల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించింది. గ్రామ సచివాలయాలు, ఆర్‌బీకేలు, బల్క్‌మిల్క్ కూలింగ్ సెంటర్లు, విలేజ్ క్లినిక్‌లు, డిజిటల్ లైబ్రరీలు వంటి వాటిని నిర్మించింది. రైతు భరోసాతో అన్నదాతలకు ఆదుకుంది. మద్దతు ధరతో పంటలను కొనుగోల చేసి కర్షకులకు అండగా నిలిచింది. ఆదోని, నంద్యాలల్లో మెడికల్ కళాశాలలు నిర్మించింది. నాడు–నేడు పేరుతో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు పెంచింది.
సేవా రంగంలోకి బ్యాంకులు, బీమా కంపెనీలు, హోటళ్లు తదితరవన్నీ వస్తాయి. సేవలకు విలువ కట్టి జీడీవీఏ లెక్కిస్తారు. 2025–26లో కర్నూలు జిల్లాలో సేవా రంగం ద్వారా జీడీవీఏ రూ. 29927 కోట్లు, నంద్యాల జిల్లాలో రూ.18,266 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటి ఆరు నెలల్లో కర్నూలు జిల్లాలో జీడీవీఏ రూ.12058 కోట్లు, నంద్యాల జిల్లాలో రూ.8181 కోట్లు సాధించినట్లు లెక్కలు ఉన్నాయి. మిగిలిన జీడీవీఏను మార్చిలోపు సాధించనున్నట్లుగా అధికారులు లెక్కలు చెబుతున్నాయి.


