
భక్తుల జేబుకు చిల్లు
శ్రీశైలంటెంపుల్: భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనార్థం శ్రీశైలం వచ్చే భక్తులకు జేబులకు చిల్లులు పడుతున్నాయి. క్షేత్రంలో ఆహార పదార్థాల ధరలు అకాశాన్ని అంటుతున్నాయి. దేవస్థాన అధికారులు, సివిల్ సప్లయ్ అధికారులు ధరల నియంత్రణలో విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో మల్లన్న దర్శనార్థం వచ్చే భక్తులకు అధిక ధరల పోటు తప్పడం లేదు. శ్రీగిరి క్షేత్రంలో చిన్న, పెద్దహోటళ్లు అన్ని కలిపి 50 వరకు ఉంటాయి. క్షేత్రంలో ప్రైవేట్ హోటళ్లలో టిఫిన్, భోజనం చేద్దామంటే భక్తుల జేబుకు చిల్లులు పడే ధరలు దర్శనమిస్తున్నాయి. భక్తుల అవసరాలను అసరాగా చేసుకుని స్థానిక ప్రైవేట్ వ్యాపారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. నాణ్యత ప్రమాణాలు లేకుండా అధిక ధరలకు విక్రయిస్తున్నా అడిగేవారు లేరు. శివరాత్రి, ఉగాది ఉత్సవాల సమయంలో మాత్రమే సివిల్ సప్లయ్ అధికారులు ధరలను ఫిక్స్ చేసి ధరల పట్టిక ఏర్పాటు చేస్తారు తప్పా..మిగతా రోజుల్లో అంతా వ్యాపారుల చేతుల్లోనే ధరలు ఉంటాయి. హోటల్‌లో ఆహార పదార్థాలలో నాణ్యమైన పదార్థాలు వినియోగిస్తున్నారా? లేదా? అని తనిఖీలు చేసే అధికారులు కరువయ్యారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు జిల్లా కేంద్రంలో ఉండడం, జిల్లా కేంద్రానికి శ్రీశైలం సుదూర ప్రాంతం కావడంతో ఇక్కడికి వచ్చి ఆహార పదార్థాల శాంపిల్స్ తనిఖీ చేసే అధికారులు కరువయ్యారు. తక్కువ ధరకు వచ్చే వస్తువులతో ఆహార పదార్ధాలు తయారు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆహార పదార్థాల తయారీలో శుచీ, శుభ్రతను సైతం పాటించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై న దేవస్థానం, సివిల్ సప్లయ్ అధికారులు స్పందించి శ్రీశైల మహాక్షేత్రంలో ఆహార పదార్థాలను అధిక ధరలకు విక్రయించకుండా, సామాన్య భక్తులకు సైతం అందుబాటులో ఉండేవిధంగా ధరలను నిర్ణయించి, ధరల పట్టికను హోటల్ నిర్వాహకులు ప్రదర్శించేలా ఏర్పాటు చేసి భక్తుల జేబులకు చిల్లులు పడకుండా తగు చర్యలు తీసుకోవాలని పలువురు భక్తులు కోరుతున్నారు.
శ్రీశైల
ఆలయం
శ్రీగిరిలో అధికరేట్లకు ఆహార పదార్థాలు
హోటళ్లు, దుకాణాలపై కొరవడిన అధికారుల పర్యవేక్షణ

భక్తుల జేబుకు చిల్లు