కర్నూలు(టౌన్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎస్వీ విజయ మనోహరి నియమితులయ్యారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆమెను నియమిస్తూ మంగళవారం రాత్రి పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఫసల్ బీమా యోజనకు సర్వర్ సమస్య
కర్నూలు(అగ్రికల్చర్): ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు సర్వర్ సమస్య రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గత నెల 30వ తేదీ నుంచి సర్వర్ సమస్య వేధిస్తున్నప్పటికీ పరిష్కారానికి వ్యవసాయ శాఖ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. పీఎంఎఫ్‌బీవై కింద ప్రీమియం చెల్లింపు గడువు జూలై 31తోనే ముగిసింది. అయితే సర్వర్ సమస్యతో రైతులు సద్వినియోగం చేసుకోలేదనే కారణంతో నాన్ లోనీ ఫార్మర్స్‌కు ఈ నెల 14 వరకు, లోనీ ఫార్మర్స్‌కు ఈ నెల చివరి వరకు ప్రీమియం చెల్లింపు గడువును పొడిగించింది. అయితే సర్వర్ సమస్య యథావిధిగా కొనసాగుతుండటం రైతులకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. గడువు పెంచినప్పటికీ సర్వర్ సమస్య పరిష్కారం కాకపోవడంతో రైతుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆలూరు, కల్లూరు, ఓర్వకల్, వెల్దుర్తి తదితర మండలాల్లో సర్వర్ సమస్య కారణంగా షోయింగ్ సర్టిఫికెట్ జనరేట్ కావడం లేదు. ప్రీమియం చెల్లించేందుకు కేంద్రం గడువు పెంచినప్పటికీ రైతులు ఉపయోగించుకోలేని పరిస్థితి నెలకొంది.
రైతుల అవసరాలపై
బ్లాంకెట్ సర్వే
కర్నూలు(అగ్రికల్చర్): కూటమి ప్రభుత్వం పశుపోషణ రంగంలో రైతుల అవసరాలపై సర్వే చేపట్టింది. పశు పోషణలో రుణాలు, బీమా అవసరాలపై బ్లాంకెట్ సర్వే కార్యక్రమాన్ని పశుసంవర్ధకశాఖ కొద్ది రోజులుగా నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 15 వరకు ఈ సర్వే కొనసాగనుంది. జిల్లాలో 600 గ్రామాలు ఉండగా... 450 గ్రామాల్లో ఈ సర్వే జరుగుతోంది. ఆయా గ్రామాల్లో 85,980 హౌస్‌హోల్డ్‌ను సర్వే చేస్తారు. ఏహెచ్‌ఏలు, పారా సిబ్బంది 317 మంది ఈ సర్వేలో నిమగ్నమైనట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ జి.శ్రీనివాస్ తెలిపారు.
వృద్ధుల ఇంటికే రేషన్ సరుకులు
కర్నూలు(సెంట్రల్) : 65 ఏళ్లు దాటిన వృద్ధులకు కచ్చితంగా రేషన్ సరుకులను ఇళ్ల దగ్గరకే తీసుకెళ్లి ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె జిల్లా పౌరసరఫరాల అధికారి ఎం.రాజారఘువీర్, మునిసిపల్ అధికారులు, కర్నూలు తహసీల్దార్ కార్యాలయ ఉప తసీల్దార్లతో సమీక్షించారు. ప్రతి నెల 25 నుంచి నెలాఖరులోపు వృద్ధులకు కచ్చితంగా ఇళ్లకే వెళ్లి డీలర్లు సరుకులను ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.
పేకాట స్థావరంపై
పోలీసుల దాడి
● టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో పేకాట
పాణ్యం: తమ్మరాజుపల్లె గ్రామంలో టీడీపీ నాయకులే స్వయంగా పేకాట ఆడిస్తున్నారు. మంగళవారం సాయంత్రం పేకాట స్థావరాలపై పోలీసులు దాడి చేశారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు.. గ్రామ సమీపంలోని కొండ ప్రాంతంలో పేకాట శిబిరంపై దాడి చేశారు. పేకాట ఆడుతున్న వారిని పట్టుకునేందుకు ప్రయ త్నం చేయగా పోలీసుల చేతి నుంచి పలువురు తప్పించుకొని పరారయ్యారు. పేకాట స్ధావ రంలో టీడీపీ నాయకులు ఎర్రమల నాయుడు, మీని గ శ్రీరంగడు, నాగరాజు పట్టుబడ్డారు. గ్రామ టీడీపీ నాయకులు బత్తుల శ్రీనివాసులు అలియా స్ దుబాయ్ శ్రీనుతో పాటు మరో నలుగురు పరారయ్యారు. అయితే టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఈ పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం. పరారైన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పట్టుబడిన నిందితుల నుంచి రూ.14,930, రెండు బైక్‌లు, 3 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ నరేంద్రకుమార్ రెడ్డి తెలిపారు.
మల్లన్నకు ఊయల సేవ
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో లోక కల్యాణం కోసం మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. మంగళవారం శ్రీస్వామిఅమ్మవార్లకు పల్లకీ ఉత్సవాన్ని నిర్వహించారు. ముందుగా లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని పఠించి, మహా గణపతిపూజ జరిపించారు. అనంతరం శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో ఆశీనులను చేసి శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలు జరిపారు. అలాగే ఊయలలో స్వామిఅమ్మవార్లను ఉంచి షోడశోపచార పూజలు నిర్వహించారు.