
స్మార్ట్ మీటర్లు రద్దు చేయాల్సిందే
● ప్రజల సొమ్మును దోచుకునేందుకు కుట్ర ● సర్దుబాటు చార్జీల పేరుతో పేదలపై భారం తగదు ● ప్రజాసంఘాల ఐక్య వేదిక నేతలు
కర్నూలు(అగ్రికల్చర్): ప్రజలకు భారంగా మారే విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వెంటనే రద్దు చేయాలని ప్రజా సంఘాల ఐక్య వేదిక నేతలు డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ కొన్ని నెలలుగా ప్రజా సంఘాలు పోరాటం చేస్తున్నప్పటికీ కూటమి ప్రభుత్వం స్పందికపోవడం దారుణమన్నారు. స్మార్ట్‌మీటర్లను రద్దు చేయాలని ప్రజా సంఘాల ఐక్య వేదిక మంగళవారం కొత్తబస్టాండు సమీపంలోని విద్యుత్‌భవన్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. వందలాది వివిధ ప్రజా సంఘాల కార్యకర్తలు, అన్ని వర్గాల ప్రజలు విద్యుత్ భవన్ ఎదుట బైఠాయించి స్మార్ట్‌మీటర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కల్లూరు దర్వాజ, జొహరాపురం, బి.క్యాంపు, కేవీఆర్ మహిళ డిగ్రీ కళాశాల దగ్గర ఉన్న పవర్‌హౌస్, కల్లూరు ఎస్టేటు తదితర ప్రాంతాల్లో ఉన్న సబ్ స్టేషన్ ఎదుట ఆందోళనలు చేపట్టారు. గురుశేఖర్ అధ్యక్షతన జరిగిన ధర్నానుద్దేశించి సీఐటీయూ జిల్లా నాయకులు రాముడు, రైతు సంఘం సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు, ఏడీఐఎస్‌వో రాష్ట్ర నాయకులు హరీష్, నాగన్న, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి అలివేలు, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కోశాధికారి నగేష్, సీఐటీయు ఆటో యూనియన్ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ మాట్లాడుతూ... ఎన్నికలకు ముందు స్మార్ట్ మీటర్లను పగులకొట్టమని పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ నేడు వాటినే బిగిస్తుండటం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని రద్దు చేయకపోతే కూటమి ప్రభుత్వానికి పతనం తప్పదని హెచ్చరించారు. అనంతరం విద్యుత్ శాఖ ఎస్‌ఈ ఉమాపతికి వినతిపత్రం సమరించారు.
– జొహరాపురం విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట జరిగిన ధర్నాలో పాల్గొన్న కార్మిక ప్రజా సంఘాల ఐక్య వేదిక జిల్లా నాయకులు గౌస్‌దేశాయ్ మాట్లాడుతూ... స్మార్ట్‌మీటర్లు బిగించడం అంటే ప్రజల సొమ్మును విద్యుత్ బిల్లుల పేరుతో కార్పొరేట్ కంపెనీలకు దోచి పెట్టడమేనని, స్మార్ట్ మీటర్ల స్థానంలో పాత మీటర్లను బిగించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వస్తే ఒక్కపైసా చార్జీలు పెంచమని చెప్పిన చంద్రబాబు నేడు అడ్డుగోలుగా టూఅప్ చార్జీలు, సర్దుబాటు పేరుతో ప్రజల నడ్డివిరుస్తున్నారన్నారు. ధర్నా కార్యక్రమాల్లో ప్రజాసంఘాల నేతలు మహమ్మద్, శేషాద్రి, అబ్దుల్లా, హుసేనయ్య, శ్రీరాములు, మధు, ఇర్పాన్ పాల్గొన్నారు.