
లోకల్ యాప్ ద్వారా ఉద్యోగాల పేరుతో వల
కర్నూలు: లోకల్ యాప్ ద్వారా నకిలీ నోటిఫికేషన్లు పంపి నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుని పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని, యువత అప్రమతంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇటీవల కర్నూలు పట్టణా నికి చెందిన ఓ యువకుడు ఉద్యోగ వేటలో లోకల్ యాప్‌లో ప్రైవేటు బ్యాంకు పేరుతో ఉన్న ప్రకటన చూసి సంబంధిత ఫోన్ నంబర్‌ను సంప్రదించగా ఫోన్‌లోనే ఇంటర్వ్యూ పూర్తి చేసి ఎంపికయ్యావంటూ ప్రాసెసింగ్ ఫీజు, బ్యాంకు గ్రౌండ్ వెరిఫికేషన్, యూనిఫాం, ఐడీ కార్డు పేరుతో రూ.39 వేలు డిమాండ్ చేశారని, ఆ మొత్తాన్ని చెల్లించిన తర్వాత మోసగాళ్లు టచ్‌లో లేకుండా పోయారన్నారు.
అలాగే ఆదోని ప్రాంతానికి చెందిన మరో యువకుడు అసిస్టెంట్ మేనేజర్ పోస్టు కోసం దరఖాస్తు చేసుకోగా జాబ్ బాండింగ్ చార్జి పేరిట రూ.76 వేలు వసూలు చేసి తర్వాత నకిలీ ఆఫర్ లెటర్ పంపించి మోసం చేశారని వివరించారు. ఇలా లోకల్ యాప్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలంటూ నకిలీ ప్రకటనలు ప్రచురించి నిరుద్యోగుల వద్ద నుంచి ధ్రువపత్రాలు, ఫీజుల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. కొంతమంది తాము ప్రభుత్వ అధికారులమని చెప్పుకుని నమ్మించి నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నారని వెల్లడించారు.
మోసం చేసే విధానం...
ఆకర్షణీయమైన జాబ్ నోటిఫికేషన్లు లోకల్ యాప్ ద్వారా పంపిస్తారు. తక్కు వ అర్హతతో అధిక వేతనం అంటూ ఆకర్షిస్తారు. ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్ ఫీజు, ప్రాసెసింగ్ చార్జీలు అడగటం, నకిలీ ఇంటర్వ్యూ లు, నకిలీ ఆఫర్ లెటర్లు పంపి మోసం చేస్తారు.
పోలీసు సూచనలు
ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల నియామక ప్రక్రియ అధికారిక వెబ్‌సైట్లు, నోటిఫికేషన్ల ద్వారా ప్రతిభ ఆధారంగానే జరుగుతుంది. ఉద్యోగం కోసం ఎవరూ డబ్బులు అడగరు. అడిగితే అది మోసమనే విషయం గుర్తించాలి. లోకల్ యాప్ వంటి ఫ్రీ క్లాసిఫైడ్ యాప్‌లలో వచ్చిన ఉద్యోగ ప్రకటనలను పూర్తిగా క్రాస్ చెక్ చేసుకోవాలి. అపరిచిత నంబర్ల నుంచి వచ్చిన కాల్స్, వాట్సాప్ సందేశాల్లో లింకులపై క్లిక్ చేయరాదు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నెంబర్‌కు, www.cybercrime.gov.inలో ఫిర్యా దు చేయాలని ఎస్పీ సూచించారు.