● తగ్గిన సంతానోత్పత్తి రేటు ● కర్నూలు జిల్లాలో 1.8, నంద్యాల జిల్లాలో 1.36 రేటు ● జీవనశైలి మారడంతో తగ్గుదల ● యువతుల్లో స్థూలకాయం, పీసీఓడీ ● పురుషుల్లో తగ్గుతున్న శుక్రకణాల సంఖ్య ● 20 శాతం మందికి సంతానలేమి సమస్య ● పెరిగిన సంతాన సాఫల్య కేంద్రాలు
కర్నూలు(హాస్పిటల్): సృష్టిలో ప్రతి సీ్త్ర తను ఒక బిడ్డకై నా జన్మనిచ్చి అమ్మకావాలని భావిస్తుంది. ఈ మేరకు వివాహమైన నాటి నుంచి పరితపిస్తుంది. పుట్టిన బిడ్డ ఆమె పెంపకంలో పెరుగుతూ ఎదుగుతూ ఉంటే ఆ తల్లి పడే ఆనందానికి హద్దులు ఉండవు. కానీ ఈ వరం ఇప్పుడు అందరి తల్లులకు కలగడం లేదు. కొందరికి ఆలస్యంగా పిల్లలవుతుంటే మరికొందరికి అసలు కావడం లేదు. దంపతులిద్దరిలో లేదా ఒకరిలో లోపం ఉండటం వల్లే ఇలా జరుగుతోంది. జీవనశైలిలో వచ్చిన మార్పులే దీనికి ప్రధాన కారణమని వైద్యులు భావిస్తున్నారు. ఈ క్రమంలో సంతాన సాఫల్య కేంద్రాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సంతానలేమి సమస్యతో బాధపడే వారి సంఖ్య అధికమైంది. ఒకప్పుడు వందలో ఒకరిద్దరు మాత్రమే సంతానలేమితో బాధపడేవారు. ఇప్పుడు ఆ సంఖ్య పట్టణాల్లో 20 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 10 శాతం వరకు ఉంటోంది. 2023–24 సంవత్సరంలో రాష్ట్రంలో సగటు సంతానోత్పత్తి రేటు 1.21 ఉండగా ఇందులో కర్నూలు జిల్లాలో 1.80, నంద్యాల జిల్లా 1.36గా నమోదైంది. కాగా జిల్లాలోని ఆదోని, పత్తికొండ వంటి ప్రాంతాల్లో సంతానోత్పత్తి 3, 3.5 రేటు ఉండగా కర్నూలు, నంద్యాల వంటి పట్టణ ప్రాంతాల్లో మాత్రం 1.5 కంటే తక్కువగా సంతానోత్పత్తి రేటు పడిపోవడం ఆందోళనకరం.
పెరిగిన సంతాన సాఫల్య కేంద్రాలు
పిల్లలు కలగని దంపతులు ఒకప్పుడు సమీప గైనకాలజిస్టులను కలిసి చికిత్స తీసుకునేవారు. అప్పటికీ పిల్లలు కలగకపోతే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్, చైన్నె, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లి సంతా న సాఫల్య కేంద్రాల్లోని వైద్యులను సంప్రదించేవారు. వీరి డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని సిటీల్లో ని సంతాన సాఫల్య కేంద్రాలు పట్టణాల్లోనూ ఏర్పాటవుతున్నాయి. ఈ కారణంగా కర్నూలు, నంద్యాల, ఆదోని వంటి ప్రాంతాల్లోనూ సంతానసాఫల్య కేంద్రాలు వెలిశాయి. కర్నూలు జిల్లాలోనే వైద్య ఆరోగ్యశాఖ వద్ద రిజిస్టర్ అయిన సంతాన సాఫల్య కేంద్రాలు 16 ఉన్నాయి. ఆయా కేంద్రాలకు ప్రస్తుతం ప్రతిరోజూ 50 నుంచి 60 మంది దాకా దంపతులు చికిత్స కోసం వెళ్తున్నారు. కాగా కొన్ని కేంద్రాలు వీరి ఇబ్బందులను ఆసరాగా తీసుకుని అధిక మొత్తంలో డబ్బును డిమాండ్ చేస్తున్నారు. వెళ్లిన ప్రతిసారి రూ.4వేల నుంచి రూ.5వేలు ఖర్చు అయ్యేలా చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కొన్ని కేంద్రాలు సంతానం కలగకపోవడానికి గల కారణాన్ని బట్టి గంపగుత్తగా రూ.1లక్ష నుంచి రూ.3లక్షల వరకు వసూలు చేస్తున్నాయి.
సంతానలేమికి కారణాలు
ఇటీవల కాలంలో చాలా మంది యువతీయువకులు జీవితంలో స్థిరపడ్డాక వివాహం చేసుకుంటున్నారు. దీనికితోడు చదువుకున్న అమ్మాయిలు అధి కం కావడం, వారికి సరిపడా అబ్బాయిలు లభించకపోవడం, అమ్మాయిల సంఖ్య తగ్గిపోవడం వంటి కారణాల వల్ల ఆలస్యంగా వివాహం చేసుకోవడం, మారిన జీవనశైలి, వ్యాయామం లేకపోవడం, స్థూలకాయం, సీ్త్రలలో పీసీఓఎస్ (అండాశయంలో తిత్తులు), ఎండోమెట్రియాసిస్ సమస్యలు, రాత్రివేళల్లో ఆలస్యంగా నిద్రపోవడం,జంక్‌ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, మొబైల్‌ఫోన్ స్క్రీన్ ఎక్కువగా చూడటం వల్ల, అన్యోన్య దాంపత్యం లేకపోవడం వల్ల సంతానలేమికి కారణాలు. అయితే గ్రామాల్లో ఇప్పటికీ త్వరగా వివాహాలు కావడం, చిన్న వయస్సులోనే (టీనేజిలో) పిల్లలు అవుతున్నారు. ఈ కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో సంతానోత్పత్తి రేటు ఎక్కువగా కనిపిస్తోంది. పట్టణాల్లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటోందని వైద్యులు చెబుతున్నారు.
ఇలా చేయాలి...
సమతుల ఆహారం తీసుకోవాలి. రోజూ తగినంత వ్యాయామం చేయాలి. బయటి ఆహారానికి ముఖ్యంగా జంక్‌ఫుడ్, ఫాస్ట్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి.
స్థూలకాయం తగ్గించుకోవాలి. ఇందుకోసం జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి.
దూమపానం, మద్యపానం మానేయాలి.
మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. ఇందుకోసం యోగా, ధ్యానం చేయాలి.
వివాహమై ఏడాది దాటినా గర్భం దాల్చకపోతే వైద్యులను కలిసి చికిత్స తీసుకోవాలి.
ఇలా చేయాలి
తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి
సంతాన సాఫల్య కేంద్రాలు ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా వైద్య ఆరోగ్యశాఖలో రిజిస్టర్ చేసుకోవాలి. ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు మాత్రమే వాటిని నిర్వహించాలి. రిజిస్ట్రేషన్ చేయకుండా ఏఆర్‌టీ కేంద్రాలు నిర్వహిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాము. జిల్లాలో గతంలో కంటే ఇప్పుడు సంతాన సాఫల్య కేంద్రాలు పెరిగాయి. సంతానోత్పత్తి రేటు తగ్గడమూ దీనికి ఒక కారణం కావచ్చు.
–డాక్టర్ పి.శాంతికళ, డీఎంహెచ్‌ఓ, కర్నూలు
జీవనశైలిలో మార్పులే కారణం
జీవనశైలిలో వచ్చిన మార్పులే సంతానోత్పత్తి రేటు తగ్గడానికి కారణం. ఇది పురుషుల్లో 30 శాతం, మహిళల్లో 30 శాతం ఉంది. పురుషుల్లో వీరకణాల సంఖ్య తక్కువగా ఉండటం, మహిళల్లో ఇన్‌ఫెక్షన్లు, పీసీఓఎస్, స్థూలకాయం, మానసిక ఒత్తిడి కారణాలు. పట్టణాల్లో ఆలస్యంగా వివాహం చేసుకోవడం, ఆలస్యంగా పిల్లలను కనాలనే ప్రణాళిక వేసుకోవడం కూడా సంతానోత్పత్తి రేటు తగ్గడానికి మరో కారణం.
–డాక్టర్ ఎస్.సావిత్రి, హెచ్‌ఓడీ, గైనకాలజి విభాగం, జీజీహెచ్, కర్నూలు
మాతృత్వం..దూరం!
మాతృత్వం..దూరం!