
జనని బ్యాంకు సీఈఓ అరెస్ట్
కోవెలకుంట్ల: ఎక్కువ వడ్డీ ఆశ చూపి ఖాతాదారులను మోసం చేసి బోర్డు తిప్పేసిన జననీ బ్యాంకు కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న బ్యాంకు సీఈఓ వెంకటరమణను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం స్థానిక పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ హనుమంతు నాయక్ కేసు వివరాలను వెల్లడించారు. 2021 జనవరి నెలలో వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలం సోమవాండ్లపల్లెకు చెందిన ఆకుల వెంకటరమణ, కోవెలకుంట్లకు చెందిన గువ్వల పద్మావతి మరికొంత మందితో కలిసి పట్టణంలోని ఓంశాంతి భవన సమీపంలో జనని మ్యూచువల్ ఎయిడెడ్ కో ఆపరేటివ్ పొదుపు, పరపతి సొసైటీని ఏర్పాటు చేశారు. బ్యాంకు సీఈఓగా వెంకటరమణ, కార్యదర్శిగా పద్మావతి, ఆమె కుమారుడు రవీంద్రారెడ్డి సలహాదారుడిగా, ఆమె కోడలు సౌజన్య మేనేజర్‌గా, యత్తపు వాణిదేవి గౌరవాధ్యక్షురాలిగా, హరిప్రియ కోశాధికారిగా, సుజాత అధ్యక్షరాలిగా కొనసాగుతున్నారు. సొసైటీలో డబ్బులు డిపాజిట్ చేస్తే మిగతా ప్రైవేట్ బ్యాంకుల కంటే ఎక్కువ శాతం వడ్డీ ఇస్తామని, డిపాజిట్లపై రుణాలు తీసుకోవచ్చని ప్రజలను నమ్మబలికించారు.
800 మంది నుంచి
రూ.1.10 కోట్ల డిపాజిట్లు..
జననీ బ్యాంకు నిర్వాహకులు మాటలు నమ్మి అధిక వడ్డీ ఆశతో కోవెలకుంట్లతోపాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన 800 మంది ఖాతాదారులుగా చేరి దాదాపు రూ.1.10 కోట్లు సేవింగ్స్, ఫిక్స్‌డ్, రికరింగ్ డిపాజిట్లు చేశారు. డిపాజిట్లు, సేవింగ్స్ ఖాతాదారుల బాండ్లకు గడవు తీరిపోవడంతో డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు సొసైటీ వద్దకు వెళ్లగా సంస్థ యాజమన్యం బోర్డు తిప్పేసింది. బాధితురాలిగా ఉన్న పట్టణానికి చెందిన రిటైర్డ్ అధ్యాపకుడి భార్య సావిత్రమ్మ ఫిర్యాదు మేరకు ఈ ఏడాది జూన్ 2వ తేదీన కోవెలకుంట్ల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి కేసును చేధించారు. బ్యాంకు సీఈఓ కోవెలకుంట్లతోపాటు చాగలమర్రి, బనగానపల్లె, నంద్యాల పట్టణాల్లో బ్రాంచ్‌లు ఏర్పాటు చేసి అక్కడ ప్రజలను మోసం చేసి డబ్బులు స్వాహా చేసినట్లు విచారణలో తేలింది. కోవెలకుంట్లలో 300 మంది, చాగలమర్రిలో 250, బనగానపల్లె 100 , నంద్యాలలో 40 మంది డబ్బులు పోగొట్టుకొని మోసపోయినట్లు గుర్తించారు. కోవెలకుంట్ల మెయిన్ బ్రాంచ్‌లో రూ. 1.10 కోట్లు స్వాహా చేయగా సీఈఓ వెంకటరమణ ఒక్కడే చాగలమర్రిలో ఒక మాజీ సైనిక ఉద్యోగికి చెందిన ఫిక్స్‌డ్ డిపాజిట్ రూ. 17.50 లక్షలతో కలిపి రూ. 30 లక్షలు, బనగానపల్లెలో రూ. 10 లక్షలు, నంద్యాలలో కొంత మొత్తం తన సొంతానికి వాడుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఇప్పటికే ఈ కేసులో గువ్వల పద్మావతి, ఆకుల భరద్వాజ్, బ్యాంకు అధ్యక్షురాలు సుజాతను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. గువ్వల పద్మావతమ్మ బ్యాంకుఖాతాలో ఉన్న రూ. 37 లక్షలను ప్రీజ్ చేసినట్లు పేర్కొన్నారు. సీఈఓ వెంకటరమణను పట్టణంలోని గాంధీసెంటర్ వద్ద అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుచగా మేజిస్ట్రేట్ రిమాండ్‌కు ఆదేశించినట్లు తెలిపారు. మరో ఇద్దరు నిందితులు కేసులో బెయిల్‌పై ఉండగా మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సీఐ వివరించారు. సమావేశంలో కోవెలకుంట్ల ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి, ట్రైనీ ఎస్‌ఐ అనిల్‌కుమార్ పాల్గొన్నారు.
ఎనిమిది మందిపై కేసు నమోదు
నిందితురాలి ఖాతాలోని
రూ. 37 లక్షలు ప్రీజ్
కేసులో ఇప్పటి వరకు నలుగురి అరెస్ట్
మరో ఇద్దరు నిందితులు పరారీ
బెయిల్‌పై మరో ఇద్దరు