
గర్భిణి మృతి కేసులో ముగ్గురు అరెస్ట్
నందికొట్కూరు: నాలుగు నెలల గర్భిణి శ్రీవాణి మృతికి కారణమైన ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రమణ్యం తెలిపారు. సోమవారం పట్టణంలోని రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. గడివేముల మండలం గని గ్రామానికి చెందిన గర్భిణి శ్రీవాణి అబార్షన్ వికటించి గత నెల 30వ తేదీన మృతి చెందింది. ఈ కేసులో అబార్షన్ చేసిన నందికొట్కూరుకు చెందిన ఆర్‌ఎంపీ గీతారాణి, అబార్షన్ చేయించిన శ్రీవాణి భర్త లోకేష్, అత్తా నాగేంద్రమ్మను అరెస్ట్ చేశారు. ముగ్గురిని కోర్టులో హాజరు పరుచగా మెజిస్ట్రేట్ రిమాండ్‌కు ఆదేశించినట్లు సీఐ తెలిపారు. అలాగే ఈ కేసులో కర్నూలులోని కొత్తబస్టాండ్ వద్ద ఉన్న రక్ష హాస్పిటల్‌లో లింగనిర్ధారణ జరిగిందని, ఈ మేరకు ఆస్పత్రి స్కానింగ్ సెంటర్ టెక్నిషీయన్ శేఖర్, ఆసుపత్రి మేనేజ్‌మెంట్‌పై దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
టీడీపీ నాయకునిపై కేసు నమోదు
సంజామల: ఆకుమల్ల గ్రామంలో టీడీపీలో వర్గపోరు తారా స్థాయికి చేరుకుటుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకుని కేసులు పెట్టు కున్న సంగతి అందరికీ తెలిసింది. తాజాగా గత నెల 31న ఆకుమల్లకు రైతు సేవా కేంద్రానికి ఒక లారీ యూరియా బస్తాలు వచ్చాయి. టీడీపీకి చెందిన ఒక వర్గమే అన్ని బస్తాలు తీసుకుంటుందని టీడీపీకి చెందని మరో వర్గం వ్యక్తిగత ధూషణలు చేయడంతో పంచాయితీ పోలీసు స్టేషన్ చేరింది. ఈ మేరకు దుబ్బా వెంకటేశ్వర్ రెడ్డిపై బొమ్మిరెడ్డి నాగేశ్వర్‌రెడ్డి ఫిర్యాదు చేయ డంతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రమణ య్య సోమవారం తెలిపారు.
పొలాలకు ఒంటరిగా వెళ్లొద్దు
గోనెగండ్ల: చిరుత సంచరించే గ్రామాల్లో రైతులు, వ్యవసాయ కూలీలు పొలాలకు ఒంటరిగా వెళ్లొద్దని ఆదోని ఫారెస్టు రెంజ్ ఆఫీసర్ తేజశ్విని సూచించారు. సోమవారం సాయంత్రం డిప్యూటీ రెంజ్ ఆఫీసర్ నూర్జహాన్, బీటీ ఆఫీసర్ రవి కుమార్‌తో కలసి తేజశ్విని గంజిహళ్లి గ్రామానికి చేరుకుని చిరుత సంచారంపై ఆరా తీశారు. చిరుత సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంట పొలాల్లో సంచరిస్తున్నది చిరుతనా... ఇతర అటవీ జంతువా అనేది తేలే వరకు ఆయా గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. త్వరలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి చిరుతను గుర్తించి, బంధించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.