
యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు
నంద్యాల(అర్బన్): రైతు సేవా కేంద్రాలు, సొసైటీల్లో రెండు వారాలుగా పేర్లు నమోదు చేసుకున్నా యూరియా సరఫరా కాలేదంటూ సోమవారం నంద్యాల మండలం కానాల గ్రామ రైతులు ఏపీ రైతు సంఘం, సీపీఎంల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. గ్రామ సచివాలయం ప్రధాన రహ దారి వద్ద రైతులు గంట పాటు రాస్తారోకో చేయడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా మండల వ్యవసాయాధికారి ప్రసాదరావు స్పందిస్తూ.. గ్రామానికి సరఫరా అయ్యే యూరియాను ప్రతి రైతుకు మూడు బస్తాల చొప్పున పంపిణీ అయ్యేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విమరించారు. అనంతరం ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రామచంద్రుడు, సీపీఎం మండల కార్యదర్శి బాలవెంకట్ మాట్లాడుతూ కానాల గ్రామ రైతులు రెండు వారాలుగా ఆర్‌ఎస్‌కే, సొసైటీల్లో పేర్లు నమోదు చేసుకున్నారని, అధికారులు కూటమి నేతలు చెప్పిన వారికే యూరియా సరఫరా చేస్తున్నారన్నారు. యూరియా కోసం రైతులు ఎదురు చూడాల్సి వస్తుందని చెప్పారు. యూరియా పంపిణీలో రాజకీయ నాయకుల జోక్యం వల్ల అధికారులు ఇష్టానుసారంగా పంపిణీ చేస్తున్నారన్నారు. జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని జిల్లా అధికారులు చెప్పడం దుర్మార్గమన్నారు. ప్రైవేటు వ్యాపారస్తులను ఆశ్రయిస్తున్న రైతులకు నిరాశ ఎదురవుతుందని, యూరియాతో పాటు ఇతర కాంప్లెక్స్ ఎరువులు కొనాలని నిబంధనలు పెడుతున్నారన్నారు. మధ్య దళారుల దోపిడీతో రైతాంగం నష్టపోవడంతో పాటు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులకు అవసరమైన యూరియాను వెంటనే సరఫరా చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో దస్తగిరి, జాకీర్‌హుసేన్, యూసుఫ్, హుసేన్‌వలి, సుబ్బరాయుడు, తదితరులు పాల్గొన్నారు.

యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు