
ఉరుకుంద క్షేత్రం.. భక్తజన సంద్రం
శ్రావణ మాసం రెండవ సోమవారం సందర్భంగా జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఉరుకుంద ఈరన్న స్వామి క్షేత్రం భక్తజనంతో కిటకిటలాడింది. జిల్లా నుంచే కాక తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వచ్చి స్వామి దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. సోమవారం ఒక్క రోజు రెండు లక్షలకు పైగా భక్తులు క్షేత్రానికి చేరుకున్నట్లు అంచనా. క్షేత్ర పరిసరాల్లో భక్తుల రద్దీ ఉండటంతో భక్తులు ఎల్లెల్సీ కాల్వ పరిసరాల్లో, కొండ ప్రాంతంలో, పొలాల్లోనే స్వామి వారికి నైవేద్యం తయారు చేసి పూజలు చేశారు. తలనీలాలల, దర్శన, ప్రసాద కౌంటర్ల వద్ద భక్తులు గంటల తరబడి క్యూలైన్‌లో వేచి ఉండాల్సి వచ్చింది. వాహనాల రద్దీతో భక్తులు అవస్థలు పడ్డారు. ఉరుకుందలో కోసిగి వైపు వెళ్లే వాహనాలు ఎదురెదురుగా రాకపోకలు సాగడంతో ఇరుక్కుపోయాయి. వాహనాలు ఎటు కదలకుండా రెండు నుంచి మూడు గంటలకు పైగా ట్రాఫిక్ స్తభించిపోయింది. ఎమ్మిగనూరుకు చెందిన ఆర్టీసీ బస్సులు సైతం లోపలికి వెళ్లేందుకు వీలు లేకుండా ఉండి పోయాయి. కోసిగిలో రైల్వే గేటు వద్ద కిలో మీటర్ మేరకు బారులుదీరాయి. ఒక రైలు వెళ్లి గేటు తెరిచే కొన్ని వాహనాలు ముందుకు సాగేలోపు మరో రైళ్ల రాకకు గేటు పడుతుండడంతో గంటల కొద్ది నిలిచి పోయాయి.
– కోసిగి