
ప్రతి హాస్టల్‌లో ఫిర్యాదుల బాక్స్
కర్నూలు(అర్బన్): ప్రతి హాస్టల్‌లో కచ్చితంగా ఫస్ట్ ఎయిడ్ కిట్‌తో పాటు ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేయాలని జిల్లా సాంఘిక సంక్షేమ, సాధికారత అధికారిణి బి.రాధిక ఆదేశించారు. శుక్రవారం స్థానిక సంక్షేమభవన్‌లోని తన చాంబర్‌లో ఆమె జిల్లాలోని సహాయ సంక్షేమాధికారులు, వసతి గృహ సంక్షేమాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సహాయ సంక్షేమాధికారులు తనిఖీలకు వచ్చిన సందర్భాల్లో ఆయా బాక్స్‌లను ఓపెన్ చేసి ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటారన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద జిల్లాలోని అనేక వసతి గృహాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను కాంట్రాక్టర్లతో మాట్లాడి వంద శాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల రక్షణకు సంబంధించి తమ పరిధిలోని పోలీస్ అధికారులను సంప్రదించి హాస్టల్ పరిసరాల్లో పెట్రోలింగ్ నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్నారు. పీహెచ్‌సీ డాక్టర్లను సంప్రదించి హాస్టళ్లలో ప్రతి నెలా ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు. ఆయా వసతి గృహాల్లోని బోర్ల నీటిని ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీర్ల ద్వారా పరీక్ష చేయించాలన్నారు. 10వ తరగతి పరీక్షా ఫలితాలపై ఇప్పటి నుంచే దృష్టి సారించి ట్యూటర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. సమావేశంలో సహాయ సంక్షేమాధికారులు కె.బాబు, ఎస్.లీలావతి, బి.మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.