కర్నూలు సిటీ: హంద్రీనీవా సుజల స్రవంతి పథకానికి శుక్రవారం ఎనిమిది పంపుల ద్వారా నీటిని పంపింగ్ చేశారు. ఒక్కో పంపు నుంచి 337.6 క్యూసెక్కుల చొప్పున మొత్తం 2,700 క్యుసెక్కుల నీటిని ఎత్తిపోస్తుండడంతో కాలువలో నీటి ప్రవాహం పెరిగింది. ఈ నెల చివరిలోపు 12 పంపుల ద్వారా నీటిని పంపింగ్ చేసే యోచనలో ఇంజనీర్లు ఉన్నారు. అదే విధంగా కాలువలో నీటి ప్రవాహం ఉండడంతో 68 చెరువుల పథకానికి నీటిని విడుదల చేశారు. దీంతో పాటు 110 కి.మీ దగ్గర హంద్రీనీవా ప్రధాన కాలువకు ఏర్పాటు చేసిన స్లూయిజ్ నుంచి గాజులదిన్నె ప్రాజెక్టుకు సైతం నీటిని విడుదల చేస్తున్నట్లు ఎస్‌ఈ పాండురంగయ్య తెలిపారు.
‘హంద్రీ–నీవా’ పిల్ల కాలువకు గండి
దేవనకొండ: మండలంలోని తువ్వదొడ్డి గ్రామ సమీపంలో హంద్రీ–నీవా పిల్ల కాలువకు గురువారం రాత్రి గండి పడింది. సమాచారాన్ని గ్రామస్తులు హంద్రీ–నీవా అధికారులకు తెలిపారు. అధికారులు స్పందించి జేసీబీలతో శుక్రవారం మధ్యాహ్నం నుంచి పనులు మొదలుపెట్టారు. ఈ గండి నుంచి ప్రవహించే నీరు సమీపంలోని వంకల్లోకి పారడంతో ఎటువంటి పంట నష్టం జరగలేదు. ఈ కాలువ నుంచి తువ్వదొడ్డి, నునుసరాళ్ల, పందెర్లపల్లి, బొందిమడుగుల గ్రామాలకు సంబంధించిన 600 ఎకరాల పొలాలకు నీరు వెళ్తుంది.