● ఉరుకుందలో శ్రావణ మాసోత్సవాలు ప్రారంభం
కౌతాళం: ఉరుకుంద ఈరన్నస్వామి క్షేత్రంలో శ్రావణ మాస ఉత్సవాలు శుక్రవారం ప్రారంభం అయ్యాయి. తెల్లవారు జామున 4 గంటలకు సుప్రభాతసేవ, మహామంగళ హారతి, పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులను దర్శనానికి వదిలారు. రాత్రి 8 గంటలకు ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి దీపారాధన చేశారు. గోవు పూజ అనంతరం ఆలయ గోపురంపై స్వామి జెండాను ఆవిష్కరించారు. భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామి సన్నిధిలో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. ‘ఈరన్న స్వామి.. నమోనమామి’ అని వేడుకున్నారు. శ్రావణ మాస ఉత్సవాలు ఆగస్టు 23 వరకు కొనసాగుతాయని ఆలయ డిప్యూటీ కమిషనర్ విజయరాజు తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఈరప్పస్వామి, ఉపప్రధాన అర్చకుడు మహదేవస్వామి, పర్యవేక్షకులు వెంకటేష్, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
పరీక్ష కేంద్రాన్ని
తనిఖీ చేసిన జేసీ
కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రభుత్వ రెసిడెన్సియల్ పాఠశాలల్లో బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీకి శుక్రవారం ప్రవేశ పరీక్ష నిర్వహించారు. పెద్దపాడు రోడ్డులోని సెయింట్ క్లారెట్ ఇంగ్లిషు మీడియం పరీక్ష కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బీ నవ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రవేశ పరీక్షకు హాజరైన విద్యార్థులతో ఆమె మాట్లాడారు. మొత్తం 192 మంది విద్యార్థులు 6, 7, 8, 9వ తరగతుల్లో ప్రవేశానికి నిర్వహించిన పరీక్షకు హాజరయ్యారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్షను నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్యామ్యూల్ పాల్, జీసీడీఓ స్నేహలత పాల్గొన్నారు.
ఈరన్న స్వామి.. నమోనమామి!
ఈరన్న స్వామి.. నమోనమామి!