
ముగిసిన ‘స్టాండింగ్’ నామినేషన్ల పరిశీలన
కర్నూలు (టౌన్): నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి శుక్రవారం నామినేషన్ల పరిశీలన ముగిసింది. స్టాండింగ్ కమిటీ సభ్యులుగా పోటీ చేసిన ఏడుగురు కార్పొరేటర్లు ఈ. నారాయణ రెడ్డి, వై.వెంకటేశ్వర్లు, సి.హెచ్. సాంబశివరావు, కురబ మునెమ్మ, షేక్ అహమ్మద్, దండు లక్ష్మీకాంతా రెడ్డి, పి. షాషా వలీల నామినేషన్లను వారి సమక్షంలోనే నగరపాలక అదనపు కమిషనర్ ఆర్‌జీవీ క్రిష్ణ పరిశీలించారు. వాటిని ధ్రువీకరించారు. ఈనెల 28వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. వచ్చే నెల 1వ తేదీ ఎన్నికలు నిర్వహించి, అదే రోజు ఓట్లను లెక్కించి, విజయం సాధించిన అభ్యర్థులను ప్రకటిస్తారు.
ఆరాధనోత్సవాలకు ఆహ్వానం
మంత్రాలయం రూరల్: అధ్యాత్మిక కేంద్రమైన మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలు ఆగస్టు 8 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు శ్రీమఠం అధికారులు తెలిపారు. ఉత్సవాలలో భాగంగా కర్నూలులో జిల్లా కలెక్టర్ రజింత్ బాషా, ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు శ్రీమఠం అధికారులు ఆహ్వాన పత్రికలతో పాటు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో మఠం అధికారులు ఏఏఓ ఎల్. మాధవశెట్టి, మఠం మేనేజర్ ఎస్‌కే. శ్రీనివాసరావు, సూపరిండెంట్ అనంతపురానిక్ పాల్గొన్నారు.
నిరాశాజనకంగా పంటల ధరలు
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు మరింత తగ్గిపోయాయి. గిట్టుబాటు ధరలు లభిస్తాయని ఎంతో ఆశతో వచ్చిన రైతులకు నిరాశే మిగులుతోంది. వాము ధర పూర్తిగా తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. కనిష్ట ధర రూ.6,506, గరిష్ట ధర రూ.10,606 లభించింది. ఉల్లిగడ్డలు ఇద్దరు రైతులు మాత్రమే 57 క్వింటాళ్లు తీసుకొచ్చారు. కనిష్టంగా రూ.685, గరిష్టంగా రూ.760 పలికింది. మార్కెట్‌కు వేరుశనగ ఒక మోస్తరుగా వస్తోంది. కనిష్ట ధర రూ.3,033, గరిష్ట రూ.6,880 లభించగా.. సగటు ధర రూ.4,682 నమోదైంది. కందుల ధర మరింత దయనీయంగా ఉంటోంది. కనిష్ట ధర రూ.4,083 లభించగా.. గరిష్ట ధర రూ.6,350 పలికింది. కొర్రలు, మినుములు, సజ్జలు, ఆముదం పంటలకు కూడా ధరలు ఆశించిన విధంగా లేకపోవడం గమనార్హం.
28న కౌలు రైతు
సమస్యలపై ధర్నాలు
కర్నూలు(సెంట్రల్): కౌలు రైతులపై కూటమి సర్కార్ తీరుకు నిరసనగా ఈనెల 28న రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల ఎదుట ధర్నాలు నిర్వహించనున్నట్లు ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.జగన్నాథం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కౌలు రైతులకు గుర్తింపు కార్డులు కూడా ఇవ్వడం లేదన్నారు. ఈ కారణంగా బ్యాంకుల్లో పంటరుణాలు మంజూరు చేయడం లేదని.. ఎరువులు, పురుగు మందులు అందివ్వడంలోనూ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. కౌలు రైతులకు పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తింపజేయాలని చేపట్టనున్న నిరసన కార్యక్రమంలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు
కర్నూలు (హాస్పిటల్): కేంద్ర ప్రభుత్వం బీడీ, సున్నపు రాయి, డోలమైట్ గని కార్మికుల పిల్లలు, విద్యార్థినీ, విద్యార్థులకు 2025–26 సంవత్సరానికి గాను ఉపకార వేతనాలు అందజేస్తోందని బీడీ వర్కర్స్ వెల్ఫేర్ ఫండ్ డిస్పెన్సరీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిషోర్ కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉపకార వేతనాల కోసం కార్మికుల పిల్లలు ఆన్‌లైన్‌లో నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ (scholarships. gov.in)లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రభుత్వంతో గుర్తింపు పొందిన పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థినీ, విద్యార్థులు దీనికి అర్హులని తెలిపారు. 10 వరకు చదివే విద్యార్థినీ, విద్యార్థులు ఆగస్టు 31 లోగా, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సులు చదివే విద్యార్థులు అక్టోబర్ 31 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరింత సమాచారం కోసం హెల్ప్‌లైన్ నంబర్ 0120–6619540, 040–29561297, స్థానిక బీక్యాంప్‌లోని బీడీ వర్కర్స్ వెల్ఫేర్ ఫండ్ డిస్పెన్సరీలో సంప్రదించి సమాచారం తెలుసుకోవాలన్నారు.