
కూలీల శ్రమను దోచుకోవడం దారుణం
కొలిమిగుండ్ల: ఉపాధి హామీ పథకం పనుల్లో కూలీల శ్రమను దోచుకోవడం దారుణమని జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. కొలిమిగుండ్ల మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కారపాకుల నాగవేణి అధ్యక్షతన శనివారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఫీల్డ్ అసిస్టెంట్ తమ సంతకాన్ని ఫోర్జరీ చేశారని బి ఉప్పులూరు సర్పంచ్ ఈశ్వరయ్య సభలో ప్రస్తావించగా..జెడ్పీచైర్మన్ స్పందించారు. సర్పంచ్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన వారిపై విచారణ చేసి, కేసు నమోదు చేయాలని ఏపీఓకు సూచించారు. రబీ సీజన్‌లో కొలిమిగుండ్లను కరువు మండలంగా గుర్తించినా రైతులకు ప్రభుత్వం నుంచి సాయం అందకపోవడంపై జెడ్పీచైర్మన్ ఆరాతీశారు. చాలా మంది తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం డబ్బులు రూ.8 వేలు, రూ.9వేలు మాత్రమే జమ అయ్యాయని కొందరు చెప్పగా.. తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఎంఈఓ అనడంతో జెడ్పీచైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించాలని సూచించారు. ముందస్తు ప్రణాళిక లేకనే నీటి సమస్య వస్తోందని, తగిన చర్యలు తీసుకోవాలని ఆర్‌డబ్లూఎస్ ఏఈని ఆదేశించారు. రైతు సేవా కేంద్రాల్లో యూరియా,మందులు రావడం లేదని, తిమ్మనాయినపేట వద్ద దేవదాయ మాన్యం భూముల్లో మట్టిని తవ్వుకొని తీసుకెళ్తున్నారని సభ్యులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. జిల్లా సరిహద్దు నుంచి 544–డీ జాతీయ రహదారి ఎలైన్‌మెంట్ విషయంలో రెండు చోట్ల మార్పులు చేయాల్సి ఉందని కోరారు. సభ్యులతో తీర్మాణం చేసి ఎన్‌హెచ్ అధికారులకు పంపాలని ఎంపీడీఓ ప్రసాదరెడ్డికి జెడ్పీ చైర్మన్ సూచించారు.
జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి