
కుందూనదికి పోటెత్తిన వరద
కోవెలకుంట్ల: శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కుందూనదికి భారీగా నీటిని విడుదల చేయడంతో కుందూనదికి వరదనీరు పోటెత్తింది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి శ్రీశైలం రిజర్వాయర్‌కు భారీగా వరద చేరింది. నదితీర గ్రామాల ప్రజల తాగు, సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఇటీవల కుందూకు నీటిని విడుదల చేశారు. కోవెలకుంట్ల, వల్లంపాడు, గుళ్లదూర్తి, కలుగొట్ల సమీపాల్లో కుందూనది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. నదిలో వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రజలు నది పరిసర ప్రాంతాలకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీచేశారు.