
ఆధునిక వైద్యంపై అవగాహన పెంచుకోవాలి
గోస్పాడు: ఆధునిక వైద్య పరిణామాలపై ప్రతి వైద్యుడు మరింత అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఏపీ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ శ్రీహరి రావు అన్నారు. ఐఎంఏ రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ జి.నందకిశోర్ అధ్యక్షతన ఆదివారం నంద్యాల పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో రాయలసీమ స్థాయి వైద్య వైజ్ఞానిక సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ చంద్రశేఖర్ తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి, తొలి భారత వైద్య పితామహుడు డాక్టర్ బీసీ రాయ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ డి. శ్రీహరి రావు మాట్లాడుతూ ప్రతి వైద్యుడు 5 సంవత్సరాలకు ఒకసారి మెడికల్ రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నారు. వైద్యులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం, రెన్యువల్ చేసుకోవడానికి విజయవాడ కౌన్సిల్ ఆఫీస్‌కి రావాల్సిన అవసరం లేకుండా జిల్లాలలోనే చేసుకునే అవకాశం కల్పించామన్నారు. ఎటువంటి వైద్య అర్హతలు లేని వారు, ప్రాథమిక చికిత్సకు అనుమతి ఉన్నవారు తమ పరిధి దాటి వైద్యం చేసి రోగులకు నష్టం కలిగిస్తే కౌన్సిల్ కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.
● ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ వైద్య రంగంలో వస్తున్న నూతన పరిణామాలపై వైద్యులు అవగాహన పెంచుకోవడం చాలా అవసరమని, తద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలను అందించడానికి ఇది దోహదం చేస్తుందన్నారు.
● రాష్ట్ర ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ నందకిషోర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లోని 100 ఐఎంఏ శాఖల ద్వారా సా మాజిక సేవలను చేపట్టామని, ప్రజల ఆరోగ్య పరిరక్షణలో తమ వంతు పాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు.
● సదస్సు నిర్వాహక కమిటీ చైర్మన్ డాక్టర్ రవికృష్ణ, ఐఎంఏ నంద్యాల అధ్యక్షులు డాక్టర్ మధుసూదన రావు, నిర్వాహక కార్యదర్శి డాక్టర్ మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రాంతీయ వైద్య సదస్సును నిర్వహించడంతో ఈ ప్రాంతంలోని వైద్యులకు ఆధునిక వైద్య పరిణామాలపై అవగాహన పెంచడానికి దోహదం చేస్తుందన్నారు.
● అనంతరం డాక్టర్లు రవీంద్ర, సురేష్, అశోక్, రాహుల్, రామేశ్వర్ రెడ్డి, మణిదీప్, హర్షవర్ధన్ రెడ్డి, సహదేవుడు వివిధ అంశాలపై ప్రసంగించారు. కార్యక్రమంలో డాక్టర్లు ప్రసాద్, కిశోర్, విజయభాస్కర్ రెడ్డి, భార్గవర్దన్‌రెడ్డి, అనిల్ కుమార్, శ్రీదేవి, హేమలత, పనిల్ కుమార్, రాకేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.