
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి
కర్నూలు(అర్బన్): గృహ నిర్మాణ సంస్థలో అవుట్ సోర్సింగ్ పద్ధతిన విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని ఆ ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వీ హనుమన్న కోరారు. ఆదివారం స్థానిక సంక్షేమభవన్‌లోని హౌసింగ్ ఈఈ కార్యాలయ ఆవరణలో ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన హౌసింగ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమన్న మాట్లాడుతూ,, 20 సంవత్సరాలుగా అవుట్ సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్న వర్క్ ఇన్స్‌పెక్టర్, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎంఐసీ, ఏఈ, ఐటీ మేనేజర్ తదితర కేడర్లలో ఉన్న వారందరినీ రెగ్యులర్ చేయాలన్నారు. అలాగే ఫీల్డ్‌లో పనిచేసే వారికి ఎఫ్‌టీఏ కూడా ఇవ్వడం లేదని, అనేక మంది ఉద్యోగులకు సొంత గృహాలు కూడా లేవన్నారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు ప్రభుత్వం ఇస్తున్న జీతం ఏమాత్రం సరిపోవడం లేదన్నారు. ప్రస్తుతం నెలకు ఇస్తున్న రూ.16,411లు ఇంటి అద్దెలు, విద్యుత్ బిల్లులు, ఆరోగ్య సమస్యలు, పిల్లల చదువులకు ఏ మాత్రం సరిపోవడం లేదన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, రిటైర్ అయిన ఉద్యోగుల స్థానంలో తమకు అవకాశం కల్పించాలని కోరారు. సచివాలయాల్లోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు హౌసింగ్ విధుల నుంచి తప్పించి హౌసింగ్ వర్క్‌ఇన్‌స్పెక్టర్లకు బాధ్యతలు అప్పగించాలన్నారు. సీనియారిటీ వర్క్‌ఇన్స్‌పెక్టర్లకు ఎంఐసీ, ఏఈలుగా పదోన్నతి కల్పించాలని, డీఈఓలను జూనియర్ అసిస్టెంట్లుగా మార్చాలన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షులు నేనావత్ రామునాయక్, నాయకులు ఎండీ యాసిన్, అఫ్రోజ్, ఉస్మాన్, దస్తగిరి, రామేశ్వరి, షాకీరా, రాజన్న తదితరులు పాల్గొన్నారు.