పులుల లెక్కింపు ఇలా.. | - | Sakshi
Sakshi News home page

పులుల లెక్కింపు ఇలా..

Jul 29 2025 8:14 AM | Updated on Jul 29 2025 8:14 AM

పులుల

పులుల లెక్కింపు ఇలా..

పచ్చని అడవుల్లో బంగారు శరీర ఛాయపై నల్లటి చారలతో పెద్ద పులి గాండ్రిస్తోంది. అనుకూల వాతావరణంతో ‘పులి’కించిపోయి పదేళ్లలో తన వర్గాన్ని రెట్టింపు చేసుకుని నల్లమల నాదేనంటూ మీసం మిలేస్తోంది. కలిసొచ్చిన కాలంతో అభయారణ్యంలో తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ షం‘షేర్‌’ అంటూ పంజా విసురుతోంది. అత్యాధునిక రక్షణ ఛట్రంలో తాను క్షేమంటూ శ్రీశైలం నుంచి శేషాచలం వైపు అడుగులు వేస్తున్న పెద్దపులి రాజసాన్ని ఇన్‌ఫ్రా రెడ్‌ కెమెరాలు కిసక్‌మంటూ బంధిస్తున్నాయి. జూలై 29 ఇంటర్నేషనల్‌ టైగర్‌ డే సందర్భంగా ప్రత్యేక కథనం.

– ఆత్మకూరురూరల్‌

శాబ్ద కాలం వెనక్కు వెళ్తే నల్లమల అడవుల్లో ఎక్కడ చూసినా.. కలప కోసం వెళ్లే మనుషులు, వారి ఎద్దుల బండ్లు, సైకిళ్ల వరుసలు కనిపించేవి. గొడ్డలి మోతలతో అడవి దద్దరిల్లేది. జాతీయ పులుల సంరక్షణాసాధికార సంస్థ తీసుకున్న నిర్ణయాలను తూచా తప్పక పాటించిన స్థానిక అధికారులు అడవిలో మానవ సంచారాన్ని పూర్తి స్థాయిలో నిరోధించారు. ప్రస్తుతం ఆదిమ గిరిజనులైన చెంచులు, అటవీ సిబ్బంది తప్ప అడవుల్లో తిరిగే వారే లేరు. ఇది పులుల సంరక్షణకు ఎంతో కలసివచ్చింది. పులుల సంచారానికి, సంయోగానికి ఆటంకం లేని పరిస్థితులతో వాటి సంఖ్య పెరగడానికి దోహదపడిందని చెప్పవచ్చు. నాగార్జునసాగర్‌ – శ్రీశైలం పెద్ద పులుల అభయారణ్యం యావత్‌ భారత దేశంలోనే విస్తీర్ణం రీత్యా అతి పెద్ద పెద్దపులుల అభయారణ్యం. సుమారు 3500 చ.కిమీ పరిధిలో విస్తరించిన ఈ అభయారణ్యంలో ఆత్మకూరు అటవీ డివిజన్‌ అత్యంత కీలకమైనది. ఎన్‌ఎస్‌టీఆర్‌లో 2015 నాటికి 37 పెద్దపులులు ఉన్నట్లు అటవీ అధికారులు గుర్తించారు. కాగా 2025 నాటికి ఈ సంఖ్య 87కు చేరుకుంది. అలాగే పులుల గణనలో మూడేళ్ల లోపు కూనలను లెక్కింపులోకి తీసుకోరు. దశాబ్ద కాలంలో ఎన్‌ఎస్‌టీఆర్‌లో పెద్దపులుల సంఖ్య ఏకంగా 87కు చేరుకుని దాదాపు 50 పులులు మేర పెరగడం పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. ఆత్మకూరు అటవీ డివిజన్‌లోని శ్రీశైలం, నాగలూటి, బైర్లూటీ రేంజ్‌లు పులుల ప్రవర్దనానికి స్వర్గధామం. వాటి సంరక్షణా పద్ధతుల్లో అధికారులు తీసుకున్న చర్యలతో పాటు సహజ ఆవాసపు నాణ్యత కూడా కారణాలు అని చెప్పవచ్చు. పులి చాలా సిగ్గరి జంతువు. పులుల సంగమ సమయంలో మనిషి అలికిడి విన్నాచాలు అవి వెంటనే సమాగం నుంచి దూరమవుతాయి. లేత గర్భంతో ఉన్న ఆడపులులకు మానవ కలకలం వినపడినా సరే బెదురుతో గర్భస్రావం అవుతుంది. పులి విహారానికి ఆటంకం జరగకుండా అడవుల్లో మానవ ప్రవేశాన్ని సంచారాన్ని నియంత్రిస్తున్నారు.

వైల్డ్‌లైఫ్‌ క్లినిక్‌

ఎన్‌ఎస్‌టీఆర్‌ పరిధిలో పని చేసేందుకు ఆత్మకూరు అటవీ డివిజన్‌ కేంద్రంగా బైర్లూటీలో ఒక వైల్డ్‌లైఫ్‌ క్లినిక్‌ ఏర్పాటు అయ్యింది. ఇందులో ఇద్దరు వన్యప్రాణి వైద్య నిపుణులు పని చేస్తున్నారు. వీరికి సహాయకారిగా ఒక అనిమల్‌ రెస్క్యూ వాహనం కూడా ఉంటోంది. పులులతో పాటు ఏ ఇతర వన్య ప్రాణులు గాయపడినప్పుడు సత్వర చికిత్స అందించేందుకు ఈ క్లినిక్‌ ఎంతో ఉపయుక్తంగా ఉంది. అలాగే ఒక స్నిఫర్‌ డాగ్‌ కూడా ఉంది. ఇది ఇద్దరు సంరక్షకుల శిక్షణతో పని చేస్తోంది.

శేషాచలం వైపు అడుగులు

నల్లమలలోని శ్రీశైలం నుంచి శేషాచలం అడవుల వరకు పెద్దపులి ప్రస్థానం కొనసాగాలని ఆకాంక్షించిన అటవీ అధికారులు ఆదిశగా కార్యక్రమాలు చేపట్టారు. శ్రీశైలం, గుండ్ల బ్రహ్మేశ్వరం, నంద్యాల అటవీ డివిజన్‌, రుద్రవరం రేంజ్‌, వైఎస్సార్‌ జిల్లా లంకమల వరకు పెద్దపులుల ప్రస్థానం కొనసాగింది. ఈ నేపథ్యంలో పులులు స్వేఛ్ఛగా సుదూర ప్రాంతాలకు తరలి వెళ్లడానికి తగిన వసతులు కల్పించడమే శ్రీశైలం – శేషాచలం పెద్దపులుల కారిడార్‌ ఆలోచనకు నాంది అయ్యింది. ఇటీవల ఆత్మకూరు అటవీ డివిజన్‌ పరిధిలో ఒక పెద్దపులి ఏకంగా అడవిని దాటి పూర్తిగా మైదాన ప్రాంతంలో 25 కిమీ సంచరించి తిరిగి అడవిలోకి వెళ్లడాన్ని అధికారులు గుర్తించారు. దీంతో పులి కారిడార్‌పై కొత్త ఆశలు చిగురించాయి. ఎలాంటి పచ్చదనం లేక పోయినా పులి ముందుకు వెళ్లగలుగుతుందనే నమ్మకం ఏర్పడింది. ఇక కేవలం పులికి, మనిషికి ఏర్పడే సంఘర్షణ నివారణ చర్యలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుందని గుర్తించారు.

పెద్ద పులుల పాద ముద్రలు సేకరించి వాటి ఆధారంగా పులుల సంఖ్యను అంచనా వేయడాన్నే స్టాండర్డ్‌ ఫగ్‌మార్క్‌ ఎన్యూమరేషన్‌ పద్ధతిగా పిలుస్తారు. పులుల సంచారాన్ని గుర్తించడం, అవి సంచరించే దారుల్లో రోజు సాయంత్రం మెత్తటి ఇసుక, మట్టితో నియమిత ప్రమాణంలో చదును చేస్తారు. వీటినే ఫగ్‌ ఇంప్రెషన్‌ ప్యాడ్స్‌గా పిలుస్తారు. పులులు ఆ ప్యాడ్స్‌ మీద నడిచినప్పుడు వాటిపై ఏర్పడిన పాదముద్రలను ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తో అచ్చులుగా మారుస్తారు. ఇలా సేకరించిన అచ్చులను ఒక క్రమ పద్ధతిలో విశ్లేషించి పులుల సంఖ్యపై ఓ అంచనాకు వస్తారు. అలాగే అడవుల్ల ఇన్‌ఫ్రారెడ్‌ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిల్లో పడే చిత్రాల ఆధారంగా పులుల చారలను విశ్లేషిస్తారు. పులి చారలు మనుషుల వేలిముద్రలలాగే దేనికవే ప్రత్యేకంగా ఉంటాయి. పులి పెంటను సేకరించి వాటి డీఎన్‌ఏ మ్యాప్‌లను సేకరిస్తారు.

పులుల స్వర్గధామం...

ఆత్మకూరు అభయారణ్యం

దశాబ్దకాలంలో రెండింతల

పెరుగుదల

శ్రీశైలం – శేషాచలం కారిడార్‌కు

ప్రయత్నాలు

నేడు అంతర్జాతీయ పెద్దపులుల

దినోత్సవం

పులుల లెక్కింపు ఇలా..1
1/2

పులుల లెక్కింపు ఇలా..

పులుల లెక్కింపు ఇలా..2
2/2

పులుల లెక్కింపు ఇలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement