
ఉద్యోగాల పేరుతో మోసం
కర్నూలు: ఉద్యోగాల పేరుతో మోసం చేశారన్న వారే ఎక్కువ మంది ఎస్పీ విక్రాంత్ పాటిల్‌ను కలసి తమ బాధను చెప్పుకున్నారు. డబ్బులిస్తే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే వ్యక్తులను నమ్మి మోసపోవద్దని, పోటీ పరీక్షల ఆధారంగానే ఉద్యోగాలు వస్తాయని ఎస్పీ వారికి సూచించారు. రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ పక్కనున్న క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఎస్పీ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి వినతులను స్వీకరించి వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు మొత్తం 104 ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదులపై చట్ట పరిధిలో విచారణ జరిపి న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని బాధితులకు ఎస్పీ హామీ ఇచ్చారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా పీజీఆర్‌ఎస్‌లో పాల్గొని బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.
ఫిర్యాదుల్లో కొన్ని..
● కర్నూలుకు చెందిన వీరస్వామి ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.8 లక్షలు డబ్బులు, 5 తులాల బంగారం తీసుకుని మోసం చేశాడని నాగరాజు ఫిర్యాదు చేశారు.
● రైల్వే డిపార్ట్‌మెంట్‌లో క్యాడర్ కోర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి వెల్దుర్తికి చెందిన ప్రశాంత్ బాబు రూ.12.50 లక్షలు తీసుకుని మోసం చేశాడని శ్రీనగర్ కాలనీకి చెందిన రవిబాబు ఫిర్యాదు చేశారు.
● బీటెక్ చేసిన తనకు హైదరాబాదుకు చెందిన షణ్ముఖ్ సుదర్శన్ అనే వ్యక్తి కన్సల్టెన్సీ పేరుతో గచ్చిబౌలిలో ఐటీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.4 లక్షలు తీసుకుని మోసం చేశాడని జొహరాపురంకు చెందిన గుణశేఖర్ ఫిర్యాదు చేశారు.
ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితులు
పీజీఆర్‌ఎస్‌కు 104 ఫిర్యాదులు