స్పెషల్‌ డ్రైవ్‌లో 15 వాహనాలు సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

స్పెషల్‌ డ్రైవ్‌లో 15 వాహనాలు సీజ్‌

Jul 27 2025 7:04 AM | Updated on Jul 27 2025 7:04 AM

స్పెష

స్పెషల్‌ డ్రైవ్‌లో 15 వాహనాలు సీజ్‌

కర్నూలు: మైనర్‌ డ్రైవింగ్‌పై నగరంలో ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. కళాశాల వదిలే సమయంలో ఒక్కొక్క వాహనంపై ఇద్దరు ముగ్గురు మైనర్లు వెళ్తున్నట్లు గమనించి శనివారం ట్రాఫిక్‌ సీఐ మన్సూరుద్దీన్‌ ఆధ్వర్యంలో ముఖ్య కూడళ్లలో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. రాజ్‌విహార్‌ సర్కిల్‌లో కళాశాలల నుంచి బైకులపై ఇళ్లకు వెళ్తూ 15 మైనర్లు పోలీసులకు పట్టుబడ్డారు. ఇందులో ఎక్కువ మంది 10వ తరగతి, ఇంటర్‌ చదువుతున్నవారే కావడం గమనార్హం. వీళ్లు నడుపుతున్న బైకుల బరువు కూడా లేని విద్యార్థులను చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. వాహనాలతో పాటు మైనర్లను ట్రాఫిక్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్‌ నిర్వహించారు.

స్వాతంత్య్ర వేడుకలకు చదువుల సుజాతమ్మ

ప్రత్యేక అతిథుల్లో ఒకరుగా

ఢిల్లీకి ఆహ్వానం

కర్నూలు(అర్బన్‌): జిల్లాలోని ఓర్వకల్లు మండలం పాలకొలను గ్రామ సర్పంచ్‌ చదువుల సుజాతమ్మకు అరుదైన అవకాశం లభించింది. ఢిల్లీలో ఆగస్టు 15న నిర్వహిస్తున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రత్యేక అతిథిగా హాజరు కావాలని ఆమెకు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి ఆహ్వానం అందింది. పాలకొలను గ్రామ పంచాయతీలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన పలు పథకాలను సంపూర్ణంగా అమలు చేయడం పట్ల ఆ గ్రామం ఉత్తమ పంచాయతీగా ఎంపికై ంది. ఈ నేపథ్యంలో సర్పంచ్‌ సుజాతమ్మతో పాటు ఆమె భర్త చదువుల నాగ సుధాకర్‌రెడ్డికి కూడా ఢిల్లీ వేడుకల్లో పాల్గొనేందుకు అవకాశం లభించింది. ఈ మేరకు రాష్ట్ర పీఆర్‌అండ్‌ఆర్‌డీ కమిషనర్‌ వీఆర్‌ కృష్ణతేజ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల్లో 10 మంది సర్పంచులను ఎంపిక చేయగా, ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి పాలకొలను సర్పంచు సుజాతమ్మ ఒకరు కావడం విశేషం.

రేపు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

కర్నూలు(సెంట్రల్‌): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ పి.రంజిత్‌బాషా శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులను సమర్పించుకోవాలని సూచించారు. కలెక్టరేట్‌తోపాటు అన్ని మండల, డివిజినల్‌, మునిసిపల్‌ కార్యాలయాల్లోనూ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీరిస్తారన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో సమాచారం తెలుసుకోవడం కోసం 1100 నెంబర్‌కు కాల్‌ చేయవచ్చన్నారు. meekosam.ap.gov.in అనే వెబ్‌సైట్‌లో కూడా అర్జీలను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

క్యూలైన్ల ఏర్పాటు పరిశీలన

మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంలో వచ్చే నెల 8 నుంచి రాఘవేంద్రస్వామి ఆరాధన వేడుకలు జరగనున్నాయి. లక్షలాదిగా భక్తులు ఆరాధన ఉత్సవాల్లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో రద్దీ దృష్ట్యా నూతనంగా క్యూలైన్ల ఏర్పాటు చేపట్టారు. నేరుగా శ్రీమఠంలోకి వెళ్లడంతో ప్రాంగణంలో భక్తుల రద్దీ తీవ్రంగా ఉండటం సమస్యగా ఉంది. సమస్యను అధిగమించేందుకు శ్రీమఠం ప్రాకారం పైభాగంలో ప్రత్యేక క్యూలైన్లు నెలకొల్పారు. శనివారం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు క్యూలైన్ల ఏర్పాటును పరిశీలించారు. క్యూలైన్ల ఏర్పాటుతో భక్తుల దర్శన విధానాలను తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా దారులు ఏర్పాటు చేయాలని శ్రీమఠం అధికారులకు పీఠాధిపతి సూచించారు. పర్యవేక్షణలో శ్రీమఠం ఈఈ సురేష్‌ కోనాపూర్‌, ఇతర సిబ్బంది ఉన్నారు.

బానకచెర్ల నుంచి

నీరు విడుదల

పాములపాడు: బానకచెర్ల క్రాస్‌ రెగ్యులేటరు నుంచి 30,000 క్యూసెక్కుల నీటిని తెలుగుగంగకాల్వకు, కేసీసీ సెస్కేప్‌ చానల్‌కు, జీఎన్‌ఎస్‌ఎస్‌కు విడుదల చేస్తున్నట్లు ఏఈ దేవేంద్ర శనివారం తెలిపారు. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటరు నుంచి 30వేల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో ఉందన్నారు. ఆ నీటినంతా దిగువ కాలువలకు విడుదల చేస్తున్నామన్నారు.

స్పెషల్‌ డ్రైవ్‌లో 15 వాహనాలు సీజ్‌  1
1/1

స్పెషల్‌ డ్రైవ్‌లో 15 వాహనాలు సీజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement