జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు రెండు కేంద్రాలు
కర్నూలు సిటీ: దేశంలోని ప్రతిష్టాత్మకమైన ఐఐటీల్లో ప్రవేశాలకు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించనున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెండు పరీక్ష కేంద్రాలను ఎంపిక చేశారు. కర్నూలు సనత్‌నగర్‌లోని ఆయాన్ డిజిటల్, జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో పరీక్ష నిర్వహించనున్నారు. సుమారు 700 మంది పరీక్షకు హాజరుకానున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్–1, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పేపర్–2 పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు గంట ముందుగానే కేంద్రాల్లోకి అనుమతిస్తారు. అడ్వాన్స్‌డ్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు బీఆర్క్ కోర్సుల్లో చేరాలనుకుంటే ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు(ఏఏటీ)రాయల్సి ఉంటుంది. ఈ పరీక్ష వచ్చే నెల 5న నిర్వహించనున్నారు.
ఇద్దరు విద్యార్థులు డిబార్
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిఽధిలో నిర్వహిస్తున్న డిగ్రీ, బీఈడీ సెమిస్టర్ పరీక్షల్లో శనివారం ఇద్దరు విద్యార్థులు డిబార్ అయ్యారని వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. ఆలూరు శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల కేంద్రంలో ఒకరు, కర్నూలు డిగ్రీ కళాశాల కేంద్రంలో ఒకరు చూచిరాతకు పాల్పడగా డిబార్ చేసినట్లు పేర్కొన్నారు.
అమెరికాలో
కర్నూలు విద్యార్థి మృతి
కర్నూలు: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలు విద్యార్థి ఇస్కాల వెంకట కౌశిల్ (26) మృతి చెందాడు. కర్నూలు నగరం వెంకటరమణ కాలనీకి చెందిన ఇస్కాల రవికుమార్ కుమారుడు ఇస్కాల వెంకట కౌశిల్ అమెరికాలోని టెక్సాస్‌లోని బ్యూమౌంట్ ఉంటున్నారు. లామర్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు. టెక్సాస్‌లో కారు నడుపుతూ ఈనెల 12వ తేదీన రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. శనివారం రాత్రి మృతదేహం కర్నూలుకు చేరింది.
31న చలో సిద్ధేశ్వరం
కర్నూలు సిటీ: చలో సిద్ధేశ్వరం కార్యక్రమాన్ని ఈ నెల 31న నిర్వహిస్తున్నట్లు రాయలసీమ సాగు నీటి సాథన సమితి అద్యక్షులు బొజ్జా దశరథ రామిరెడ్డి తెలిపారు. ిసిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన 9వ వార్షికోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. అదే రోజు సిద్ధేశ్వరం వద్ద ప్రజా బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. కర్నూలులోని ఓ హోటల్‌లో క్రెడాయ్ మాజీ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం చలో సిద్ధేశ్వరంవాల్ పోస్టర్లను విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికై నా మత్తునిద్ర వదిలి రాయలసీమలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు. కృష్ణా యాజమాన్య బోర్డు కర్నూలులో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజస్వామ్య హక్కుల పరిరక్షణ వేదిక కన్వీనర్ రామకృష్ణారెడ్డి, సీడ్ గ్రోయర్స్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి మోక్షేశ్వరరెడ్డి, రాయలసీమ సాంస్కృతిక వేదిక కన్వీనర్ అప్పిరెడ్డి హరినాథరెడ్డి, సీనియర్ నాయకులు జి.చంద్రన్న, రాయలసీమ సాగు నీటి సాధన సమితి కార్యదర్శి మహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రసాద వితరణపై పర్యవేక్షణ
శ్రీశైలం టెంపుల్: అన్న ప్రసాద వితరణపై నిరంతరం పర్యవేక్షణ చేస్తుండాలని అధికారులను ఈఓ శ్రీనివాసరావు ఆదేశించారు. శనివారం రాత్రి అన్నప్రసాద వితరణ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈఓ సంబంధిత అధికారులతో మాట్లాడుతూ అన్నప్రసాద వితరణకు సమయపాలనను పాటించాలన్నారు.


