అధికారులు సమన్వయంతో పనిచేయాలి
● జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య
కర్నూలు(సెంట్రల్): దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య ఆదేశించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే ప్రజలను సురక్షితమైన ప్రదేశాల్లో ఉంచడానికి ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులపై నిఘా ఉంచాలని సూచించారు. ప్రజలను భయాందోళనలకు గురిచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్కడైనా పేలుడు పదార్థాలు ఉన్నట్లు తెలిస్తే వెంటనే పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. రేషన్, మందులు, నూనెలు తదితర నిత్యావసరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని , ఆయా వస్తులు ధరలు పెరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
రేపు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులను సమర్పించుకోవచ్చన్నారు. కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో సమాచారం తెలుసుకోవడం కోసం కాల్ సెంటర్ నంబర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని కలెక్టర్ ప్రజలకు విజ్ఞఫ్తి చేశారు. అలాగే అర్జీదారులు meekoram.ap.gov.in అనే వెబ్‌సైట్‌లో కూడా అర్జీలను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
పడిపోయిన ధాన్యం ధరలు
● కర్నూలు మార్కెట్‌లో క్వింటా
రూ.1,761 మాత్రమే
● మద్దతు ధర రూ.2,320
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో వరి ధాన్యం ధరలు పడిపోయాయి. మద్దతు ధర రూ.2,320 ఉండగా.. మార్కెట్‌లో రూ.1,760 ధర మాత్రమే లభించడం పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు మార్కెట్‌లో కొద్ది రోజులుగా ధాన్యం క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. మొదట్లో ధాన్యానికి కాస్త మెరుగ్గానే ధరలు లభించాయి. ఇంతవరకు గరిష్టంగా క్వింటాకు రూ.1,981 వరకు ధర లభించింది. శుక్ర, శనివారాల్లో ధరలు పడిపోయాయి. ఈ నెల 9న ధాన్యం క్వింటా ధర రూ.1,841 పలికింది. 10న కేవలం రూ.1,761 మాత్రమే లభించింది. మద్దతు ధరతో పోలిస్తే మార్కెట్‌లో అతి తక్కువ ధర లభిస్తుండటంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ధాన్యం ధరలు పడిపోయి రైతులు అల్లాడుతున్నా మద్దతు ధరతో కొనుగోలుకు కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం.


