83.25 టన్నుల ఎరువుల విక్రయాల నిలిపివేత స్టాక్ రికార్డుల్లో లోపాలు గుర్తించిన అధికారులు
కోడూరు: ఎరువుల విక్రయాల్లో నిబంధనలు ఉల్లంఘించిన డీలర్లపై వ్యవసాయశాఖ అధికారులు కొరడా ఝుళిపించారు. కృష్ణాజిల్లా కోడూరు మండలంలోని పలు ఎరువులు, పురుగుముందుల దుకాణాల్లో సోమవారం అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అవనిగడ్డ ఏడీఏ జే.జయప్రద, ఏఓ శ్రీధర్ సంయుక్తంగా ఈతనిఖీలు చేపట్టారు. దుకాణాల్లో లైసెన్సుల వివరాలు, తప్పనిసరిగా నిర్వహించాల్సిన రికార్డులు, నిల్వల వివరాలను పరిశీలించారు. కొందరు డీలర్లు తమ ఎరువుల లైసెన్సుల్లో ఫారం ‘ఓ’ నమోదు చేసుకోలేదని గుర్తించారు. అదేవిధంగా స్టాక్ రిజిస్టర్లు, బిల్లు పుస్తకాలను సక్రమంగా నిర్వహించకపోవడంపై ఏడీఏ జయప్రద డీలర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్‌లైన్‌లో నమోదైన ఎరువుల నిల్వలకు, గోదాముల్లో భౌతికంగా ఉన్న నిల్వలకు మధ్య వ్యత్యాసాలు ఉన్నట్లు కూడా గుర్తించారు.
రూ.17.25 లక్షల ఎరువుల అమ్మకాలపై ఆంక్షలు..
తనిఖీల్లో గుర్తించిన లోపాలను తీవ్రంగా పరిగణించిన, సంబంధిత ఎరువుల విక్రయాలను నిలిపివేస్తూ స్టాల్ సేల్ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఏడీఏ జయప్రద తెలిపారు. మొత్తం 83.25 మెట్రిక్ టన్నుల ఎరువులు, వాటి విలువ రూ.17,25,357గా గుర్తించామని, ఈ ఆదేశాలతో సంబంధిత ఎరువుల విక్రయాల నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. తనిఖీల్లో గుర్తించిన లోపాలను వారం రోజుల్లోగా సరిదిద్దుకోవాలని ఆయా ఎరువుల దుకాణాల డీలర్లకు సూచించారు. లైసెన్సులకు సంబంధించిన ఫారం ‘ఓ’ నమోదు చేయడంతోపాటు స్టాక్ రిజిస్టర్లు, బిల్లు పుస్తకాలను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. నిర్ణీత గడువులోగా స్టాప్ సేల్‌కు సంబంధించిన వివరాలు ఇవ్వకపోతే స్టాక్ మొత్తం సీజ్ చేసి ప్రభుత్వానికి అప్పగిస్తామని ఏడీఏ హెచ్చరించారు.


