దసరా ఉత్సవాల్లో రెండో రోజు భక్తుల రద్దీ సాధారణం శ్రీగాయత్రీదేవిగా దుర్గమ్మ దర్శనం రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ట్రయిల్ రన్
రాష్ట్రపతి పర్యటనకు ఏర్పాట్లు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై శ్రీ దేవీ శరన్నవ రాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో రెండో రోజైన సోమవారం శ్రీగాయత్రీదేవిగా దుర్గమ్మ భక్తులను కరుణించారు. తెల్లవారుజాము నుంచి ఉదయం వరకు భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఆదివారం క్యూలైన్‌లో భక్తులు ఎదుర్కొన్న ఇబ్బందులపై అధికారులు స్పందించారు. సోమవారం ఉదయానికే క్యూలైన్లలో ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేసి భక్తులకు వాటర్ బాటిళ్లు పంచారు. ఉదయం 10 గంటల తర్వాత క్యూలైన్లలో భక్తుల రద్దీ తగ్గింది. నూతన పూజా మండపంలో జరిగిన ప్రత్యేక కుంకుమార్చనలో దేవ దాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ దంపతులు పాల్గొన్నారు. దేవదాయ శాఖ కమిషనర్, ఫెస్టి వల్ ఆఫీసర్ త్రినాథరావు లడ్డూ పోటు, అన్నదాన భవనం, వైద్యశిబిరాలను పరిశీలించారు. గాయత్రీదేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మకు నిర్వహించిన ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు.
నేడు తమిళనాడుసీఎం విజయ్ రాక
దుర్గమ్మ దర్శనానికి తమిళనాడు సీఎం విజయ్ మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు వస్తారని ఆలయ అధికారులు తెలి పారు. ప్రముఖుల రాక ప్రారంభం కానున్న నేపథ్యంలో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది.
నేటి అలంకారం శ్రీఅన్నపూర్ణాదేవి
దసరా ఉత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీఅన్నపూర్ణాదేవిగా కనక దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తారు. నిత్యాన్నదానేశ్వరి అలంకారంలో శ్రీదుర్గ మ్మను దర్శించి తరించడం వల్ల అన్నాదులకు లోపం లేకుండా, ఇతరులకు అన్నదానం చేసే భాగ్యం అభిస్తుంది.
నృత్య నీరాజనం
విజయవాడ కల్చరల్: కనకదుర్గానగర్ లోని కళావేదికపై ప్రదర్శిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు రస రమ్యంగా సాగుతున్నాయి. కళాకారులు అన్నమయ్య, త్యాగ రాజ, రామదాసు కీర్తలనకు కళాకారులు మనోహరంగా నృత్యం చేశారు. శ్రీదుర్గామల్లేశ్వర స్వామి బృందం నాదస్వరంతో రెండో రోజు సాంస్కృతిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
వైభవంగా నగరోత్సవం
ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీగంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి వార్ల నగరోత్సవ సేవ వైభవంగా జరిగింది. సాయంత్రం మహా మండపం దిగువ నుంచి ప్రారంభమైన ఈ సేవ మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా సాగింది. ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీపై ఆదిదంపతులు కొలువై ఉండగా, పలువురు కళాకారులు ఊరేగింపు ముందు తమ కళలను ప్రదర్శించారు. సోమవారం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానానికి వివిధ టికెట్ల విక్రయం ద్వారా రూ.25.41 లక్షల మేర ఆదాయం సమకూరింది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 14వ తేదీన ఇంద్రకీలాద్రికి వస్తున్న నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో ట్రయల్ రన్ నిర్వహించారు. చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఆలయ ఈఓ, చైర్మన్, ఇంజినీరింగ్ అధికారులు చర్చించారు. ఆలయ ప్రాంగణంలోని రాష్ట్రపతి కొద్దిసేపు వేచి ఉండేందుకు డోనర్ సెల్‌లో కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రపతి ఆలయానికి విచ్చేసిన తరుణంలో ఏ విధంగా నడుచుకోవాలనే దానిపై ఏడీసీపీ సరిళ, దుర్గగుడి ఇంజినీరింగ్ అధికారులకు సూచనలు చేశారు. ఈ క్రమంలో ఈఈ రమాను రాష్ట్రపతిగా భావిస్తూ ఆలయ ప్రాంగణం నుంచి అమ్మవారి ఆలయంలో దర్శనం, తిరిగి డోనర్ సెల్ వరకు వచ్చే వరకు పాటించాల్సిన ప్రొటోకాల్‌పై అవగాహన కల్పించారు. ట్రయిల్ రన్‌లో దసరా ఫెస్టివల్ ఆఫీసర్ త్రినాథరావు, ఈఈ భాస్కర్, రాంబాబు, స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ఆలయ వైదిక కమిటీ సభ్యుడు శంకర శాండిల్య, వెస్ట్ ఏసీపీ దుర్గారావు పాల్గొన్నారు.


