ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు విజయవాడకు చెందిన పి.శేషగిరిరావు కుటుంబం వెండి వస్తువులను కానుకగా సమర్పించారు. శేషగిరిరావు కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకునేందుకు సోమవారం ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ చైర్మన్ రాధాకృష్ణను కలిసి రెండు కిలోల వెండితో తయారు చేయించిన రెండు పళ్లేలు, రెండు పాదుకలు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మ వారి దర్శనం కల్పించారు. వేద పండి తుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ చైర్మన్ అమ్మవారి ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. ఆలయ డీఈఓ కిషోర్‌కుమార్, స్థానాచార్య శివప్రసాద్ శర్మ పాల్గొన్నారు.
కృష్ణలంక(విజయవాడతూర్పు): దసరా ఉత్సవాల సందర్భంగా భక్తులు తలనీలాలు సమర్పించేందుకు సీతమ్మ వారి పాదాలు సమీపంలో ఏర్పాటు చేసిన కేశఖండన శాల సోమ వారం ఖాళీగా దర్శనమిచ్చింది. రెండో రోజైనప్పటికీ కేశఖండన శాల కౌంటర్లు ఖాళీగా, భక్తులు లేక వెలవెలబోతూ కనిపించాయి. తల నీలాల టికెట్‌కు రూ.40 వసూలు చేస్తుండటంపై భక్తుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఉచితంగా తలనీలాలు సమర్పించే అవకాశం కల్పించాలని భక్తులు కోరుతున్నారు.
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజా సమ స్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీదారులు పేర్కొన్న సమస్యలకు పరిష్కారానికి చొరవ చూపాలని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమం జరిగింది. డీఆర్వో శ్రీధర్‌రెడ్డి, కేఆర్‌ఆర్‌సీ ఎస్‌డీసీ నీలకంఠేశ్వరరెడ్డి, డీఎస్పీ ఎ.శ్రీనివాస్‌తో కలిసి జేసీ నవీన్ అర్జీలు స్వీకరించారు. అనంతరం జేసీ మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్ణీత సమయంలోగా సంతృప్తి కర పరిష్కారం చూపాలన్నారు. అర్జీదారులు ఇచ్చిన సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించి తిరిగి ఆ సమస్యపై పీజీఆర్‌ఎస్‌కు రాకుండా పరిష్కారం చూపాలన్నారు. ప్రతి వారం పీజీఆర్‌ఎస్ సమస్యల పరిష్కారంపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. పరిష్కరించిన అర్జీలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పొందుపరచాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు 97 అర్జీలను స్వీకరించారు.
గుడ్లవల్లేరు: స్థానిక వీవీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో అసోసియేషన్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ టీచర్స్ ఆఫ్ ఇండియా, ఏపీ స్టేట్ బ్రాంచ్ సహకారంతో ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ప్రెసిషన్ బయోథెరప్యూటిక్స్: షేపింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ హెల్త్ కేర్’ అంశంపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు సోమవారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ ఫార్మసీ కౌన్సిల్, సెంట్రల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ డి.నరేంద్ర మాట్లాడుతూ.. ఔషధ రంగంలో ఆధునిక పరిశోధనలు, సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధస్సు ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా వేదికపై ఉన్న ప్రముఖ అతిథుల చేతుల మీదుగా సదస్సు సావనీర్‌ను ఆవిష్కరించారు. అనంతరం అతిథులను ప్రిన్సిపాల్ లక్ష్మణరావు, కో–ఆర్డినేటర్ బి.సత్యశ్రీ ఘనంగా సత్కరించారు. తొలుత సిద్ధేంద్ర నాట్య కిరణం పురస్కార గ్రహీత ఆత్మకూరి ప్రణతి శాసీ్త్రయ నృత్యంతో అతిథులకు ఆహ్వానం పలికారు.


