చదువుతో పాటు సేవాభావం అలవర్చుకోండి విద్యార్థులకు ఈగల్ ఐజీపీ రవికృష్ణ పిలుపు
ఘంటసాల: దేశంలోనే తొలి వరి వ్యవసాయ సమాచార ఆధారిత ఏఐ అసిస్టెంట్ సేవలను రైతులకు అందుబాటులోకి తేవడంతో గర్వకారణమని ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రంలో రియా రైతు మిత్ర – వరి సలహా వాణి నూతన వ్యవసాయ ఆధారిత ఏఐ వాయిస్ ఏజెంట్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏఐ టెక్నాలజీ ద్వారా వ్యవసాయ పరంగా రైతుల సందేహాల నివృత్తికి, సాంకేతిక సలహాలు, సూచనలు అందించేందుకు కృత్రిమ మేధ ద్వారా భారతదేశంలోనే మొట్టమొదటి ఏఐ అసిస్టెంట్ సేవలు అందుబాటులోకి తెచ్చిన ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం కో–ఆర్డినేటర్, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి.సుధారాణిని అభినందించారు. ఈ సందర్భంగా ఆమెను ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఏఏంసీ ఛైర్మన్ తోట కనకదుర్గ, నియోజకవర్గ ప్రత్యేకాధికారి పెనుమూడి సాయిబాబు, వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్.హరి సత్యనారాయణ, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.విశాలాక్షి, జడ్పీ మాజీ వైస్ ఛైర్మన్ గొర్రెపాటి రామకృష్ణ, ఏపీఎస్ ఐడీసీ డైరెక్టర్ పైడిపాముల కృష్ణకుమారి, తహసీల్దార్ బి.విజయ ప్రసాద్, మండల వ్యవసాయ శాఖ అధికారిణి డి.అనూష తదితరులు పాల్గొన్నారు.
నున్న(విజయవాడరూరల్): విద్యార్థులు తమ జీవితంలో ఉన్నతమైన ఆశయాలను నిర్దేశించుకోవాలని, నిర్ణయించుకున్న లక్ష్యమే శ్వాసగా మారి, దాని సాధన వైపు మాత్రమే అడుగులు వేయాలని ఆంధ్రప్రదేశ్ ఈగల్ విభాగం ఐజీపీ ఆకే రవికృష్ణ పిలుపు నిచ్చారు. మాదక ద్రవ్యాల నివారణ పై నున్న వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో నిర్వహించిన యాంటీ డ్రగ్–డ్రగ్ ఫ్రీ సొసైటీ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక లక్ష్యం ఉండటం ఎంతో ముఖ్యమని, అయితే దాన్ని సాధించే క్రమంలో అనేక అడ్డంకులు, సమస్యలు ఎదురవుతాయని ఆయన పేర్కొన్నారు. కేవలం సమస్యలను చూసి భయపడి లేదా కృంగిపోయి చాలా మంది తమ లక్ష్యం నుంచి పక్కకు తప్పుకుంటారని, ఆ విధమైన బలహీనతే మనిషి పతనానికి దారి తీస్తుందని హెచ్చరించారు. యువతను పాడు చేస్తున్న అత్యంత ప్రమాదకరమైన మత్తు పదార్థాలు, డ్రగ్స్ సంస్కృతికి పూర్తిగా దూరంగా ఉండాలని స్పష్టం చేశారు.
సామాజిక బాధ్యత అలవర్చుకోవాలి..
పుస్తకాలకు పరిమితం కాకుండా, క్రీడలు, సంగీతం వంటివి నేర్చుకునేందుకు ప్రయత్నించాలని సూచించారు. ఇవి ఒత్తిడిని తగ్గించి, మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని చెప్పారు. విద్యార్థి దశ నుంచే సామాజిక బాధ్యత అలవర్చుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి కష్టపడి ఈ రోజు తాను ఐపీఎస్ స్ధాయికి చేరుకున్నానని గుర్తు చేశారు. ఇటీవల విధి నిర్వహణలో మృతి చెందిన నున్న సీఐ మొహమ్మద్ అలీ మృతికి రెండు నిముషాల పాటు మౌనం పాటించారు. యాంటీ డ్రగ్ టోల్ ఫ్రీ నంబర్ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కళాశాల చైర్మన్ నరెడ్ల నర్సిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఈడీ నరెడ్ల కీర్తి, డీసీపీ జి.రామకృష్ణ, ఏసీపీ పి.సత్యానందం, సీఐలు ఎండీ ఉమర్, రవీంద్ర, కృష్ణమోహన్, ప్రిన్సిపల్ సీహెచ్ వీఎస్ పరమేశ్వరరావు, డీన్ సెవుగరాజన్, ఎస్‌ఐలు నాగేశ్వరరావు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.


